భువీని ఎందుకు తీసుకోలేదు?

by Shyam |   ( Updated:2021-05-12 11:24:23.0  )
భువీని ఎందుకు తీసుకోలేదు?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ రెండు వైపులా స్వింగ్ చేయగలిగే అతి కొద్ది మంది బౌలర్లలో ఒకడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ పిచ్‌లపై బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటనకు భువీని సెలెక్టర్లు పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల కాలంలో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతో పాటు తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. గత రెండేళ్లుగా భువనేశ్వర్ కుమార్ టెస్టులు ఆడలేదు. పైగా దేశవాళీ క్రికెట్ ఆడటానికి కూడా విముఖత చూపించాడు. అంతే కాకుండా ఇంగ్లాండ్‌లో నాలుగు నెలల సుదీర్ఘ పర్యటనకు ముఖ్యమైన ఫిట్‌నెస్ కూడా భువీకి లేనట్లు తెలుస్తున్నది. ఈ కారణాల వల్లే సెలెక్టర్లు భువనేశ్వర్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది.

2018 జనవరి 24 నుంచి 27 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టే భువీకి చివరిది. ఆ తర్వాత కనీసం రంజీల్లో కూడా పెద్దగా ఆడలేదు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడి గాయాలు తిరగబెట్టడంతో డగౌట్‌కే పరిమితం అయ్యాడు. దీంతో అతడిని కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed