రోహిత్ VS రహానే.. తదుపరి కెప్టెన్ ఎవరు?

by Shyam |
రోహిత్ VS రహానే.. తదుపరి కెప్టెన్ ఎవరు?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేని సమయంలో ఎవరిని కెప్టెన్‌గా నియమించాలనే దానిపై సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉండటం దాదాపు ఖాయమే అయినా.. టెస్టు జట్టు కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, టీ20 వరల్డ్ కప్‌లలో న్యూజీలాండ్ జట్టుపై ఘోర పరాభవం తర్వాత టీమ్ ఇండియా మరోసారి స్వదేశంలో ఆ జట్టుతో తలపడనున్నది. ఇప్పటికే టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. కాగా, టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడతాడా లేదా అనేదానిపై సందిగ్దత నెలకొన్నది. తొలి టెస్టులో కోహ్లీ ఆడడని ఇప్పటికే బీసీసీఐ చెప్పింది. అయితే, రెండో టెస్టు కూడా అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే దానిపై సందిగ్దత నెలకొన్నది. తాత్కాలిక కెప్టెన్ కాకుండా.. కోహ్లీ వారసుడిగా ఎవరు ఉండాలనే దానిపైనే సెలెక్టర్లు దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది.

రోహిత్ వైపే మొగ్గు..

టీమ్ ఇండియా గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ సిరీస్‌లో కోహ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు బాధ్యతలు అప్పగించారు. రహానే నేతృత్వంలో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ముఖ్యంగా గబ్బా టెస్టులో భారత జట్టు గెలుపునకు రహానే వ్యూహాలు బాగా పని చేశాయి. అయితే, ఆ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో సెంచరీ (112) సాధించాడు. ఆ తర్వాత రహానే తన ఫామ్ పూర్తిగా కోల్పోయాడు. ఆ టెస్టు తర్వాత రహానే 11 టెస్టులు ఆడి 19.57 సగటుతో 372 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేదు. రహానే ఫామ్‌లో లేకపోవడం భారత జట్టుకు కూడా భారంగా మారింది. అదే సమయంలో టెస్టుల్లోకి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన రోహిత్ శర్మ అద్బుతంగా రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడి 48 సగటుతో 906 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. పరిమిత ఓవర్ల ఆటగాడిగా తనపై ఉన్న ముద్రను రోహిత్ శర్మ చెరిపేసేకొని టెస్టుల్లో కూడా చెలరేగిపోయాడు. అదే సమయంలో రహానే కెప్టెన్‌గా ఉన్నప్పుడు రోహిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో కోహ్లీ వారసుడిగా రోహిత్‌కే టెస్టు బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎంతో అనుభవం ఉన్న అజింక్య రహానేకు కెప్టెన్సీ ఇవ్వడమే మంచిదని చెబుతున్నారు. మళ్లీ అన్ని ఫార్మాట్లలో రోహిత్ కెప్టెన్ అయితే అతడిపై కూడా భారం పడుతుందని అంటున్నారు.

ద్రవిడ్‌దే తుది నిర్ణయం..

కోహ్లీ గైర్హాజరీ సమయంలో టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, అజింక్య రహానేలలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయం కీలకం కానున్నది. జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరిపై ద్రవిడ్‌కు ఒక అవగాహన ఉన్నది. దీంతో ఎవరి పాత్ర ఏమిటో ద్రవిడ్ ఇప్పటికే అనుకొని ఉంటారని.. తన నిర్ణయం ఏమిటో త్వరలోనే తెలియజేస్తారని అంటున్నారు. కాగా, కోహ్లీ సెలవును రద్దు చేయాలని కూడా బీసీసీఐ భావిస్తున్నది. తొలి టెస్టుకు దూరమైనా ముంబైలో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని కోహ్లీకి చెప్పినట్లు తెలుస్తున్నది. దీంతో తొలి టెస్టుకు రోహిత్‌కు కెప్టెన్సీ కట్టబెట్టినా.. రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ ఉంటాడు కాబట్టి సమస్య తీరిపోతుందని భావిస్తున్నది. మరోవైపు న్యూజీలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్‌లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. వారి స్థానంలో కొత్త వారికి టెస్టు జట్టులో అవకాశం ఇవ్వనున్నది. వారితో పాటు రిషబ్ పంత్ కూడా టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుసగా బయోబబుల్స్‌తో గడపడం వల్ల వారికి విశ్రాంతి లేకుండా పోయింది. అందుకే ప్రధాన ఆటగాళ్లకు కొన్నాళ్లు సెలవులు ఇవ్వనున్నది. వారందరూ తిరిగి సౌతాఫ్రికా సిరీస్‌కు అందుబాటులోకి రానున్నారు.

Advertisement

Next Story

Most Viewed