ఆసక్తికరంగా మారిన హుజూరాబాద్ సీన్.. యూత్ ఓటర్లు ఎటువైపు?

by Shyam |   ( Updated:2021-10-27 10:52:40.0  )
Huzurabad-by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఎన్నికల్లో కొన్ని సెక్షన్ల ఓట్లు కీలకంగా మారనున్నాయి. అందులో యువ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీతో పాటు విద్యార్థి విభాగం తరపున ఉద్యమంలో పాల్గొని కొట్లాడిన విద్యార్థులు నేడు నిరుద్యోగులుగా ఉన్నారు. పోలింగ్‌లో ఏ పార్టీకి ఓటు వేస్తారనే చర్చలు రెండు ప్రధాన పార్టీల్లో మొదలయ్యాయి. ఆకాంక్షలు నెరవేరలేదని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కొత్తగా ఉద్యోగాలు రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటివరకూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగానే కొనసాగినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ తరపున పోటీ చేస్తే అంతకంటే భిన్నంగా ఏమీ ఉండదన్న నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మాత్రం పోలింగ్‌లో ప్రదర్శిస్తామని నొక్కి చెప్తున్నారు.

ఏడేళ్లపాటు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశామని, రెండేళ్ళుగా నిరుద్యోగ భృతి కోసం చూస్తున్నామని, కానీ అవన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయని కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన యువత వ్యాఖ్యానించారు. హామీ ఇచ్చి ఆశ చూపిన అధికార పార్టీ దాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయిందని పేర్కొన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు సైతం ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారు. తక్కువ జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు చేయలేక, నెలవారీ ఖర్చులకు సరిపోక ఇబ్బందిపడుతూ సొంతూళ్ళలోనే కూలీ పని చేసుకోడానికి సిద్ధమవుతున్నారు.

సీఎం మాటలపైనే నమ్మకం పోయింది

నిరుద్యోగులకు ప్రతీ నెలా భృతి ఇస్తామని హమీ ఇచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడినా ఇప్పటికీ అమల్లోకి రాలేదంటూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన అనేక హామీలపైనా వెనకడుగు వేసిన కేసీఆర్‌పై నమ్మకం కుదరడం లేదంటూ శంభునిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి షాజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, కానీ అక్కడి రూమ్ రెంట్, ట్రాన్సుపోర్టు ఖర్చులు పోగా మిగిలేది నాలుగు వేలు రూపాయలు మాత్రమేనని, అది సొంతూళ్లో ఉండి కూడా సంపాదించుకోవచ్చని, అందువల్లనే ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ కూలీగా పనిచేసుకుంటున్నానని తెలిపారు.

ఇదే గ్రామానికి చెందిన మరో బీటెక్ విద్యార్థి సుమన్‌రెడ్డి కూడా సొంతగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరి వేయవద్దంటూ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవడంతో ఆలోచనలో పడ్డారు. వీరిద్దరికీ కొలువు లేకపోవడంతో పెళ్ళి చేసుకోడానికి కూడా చిక్కులు ఎదురైనట్లు వాపోయారు. దేశరాజుపల్లి గ్రామానికి చెందిన శృతి అనే యువతి కూడా డిగ్రీ కోర్సు పూర్తి చేసి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. మరో యువతి అనూష ఎదురుచూపులతో విసిగిపోయి స్వంతగా ఎంబ్రాయిడరీ షాపు పెట్టుకున్నది.

ఇలాంటి వందలాది మంది యువత అటు నిరుద్యోగ భృతి అందక, ఇటు జాబ్ నోటిఫికేషన్లు రాక తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వీరి ఓటు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్ పట్ల వీరికి సదభిప్రాయం లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా నిస్సహాయుడిగా మిగిలిపోయారనే సానుభూతి మాత్రం ఉన్నది. కానీ ఇప్పుడు ఆయనకు మద్దతు పలికినా తమ సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకదనే క్లారిటీతోనే ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 40 వేలకు పైగానే ఉన్న యువ ఓటర్లు ఎవరి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారన్నది పార్టీలను వేధిస్తున్న ప్రశ్న.

Advertisement

Next Story

Most Viewed