రేవంత్ రెడ్డికి మరో సవాల్.. కీలక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ

by Ramesh Goud |
Congress-party
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరువయ్యారు. హస్తం నేతలు అసలు ఉన్నారా లేరా అనేది ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్టీకి కొత్త నాయకత్వం వచ్చినా.. నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే ప్రతిపక్షం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఒకప్పుడు సికింద్రాబాద్ అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ, నేడు కనీసం గల్లీ నాయకుడు కూడా లేకపోవడం విచారకరం. సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. నేడు జెండా పట్టే కార్యకర్తలు కూడా లేకపోవడం హాస్యాస్పదంగా మారింది. ఈ నియోజకవర్గానికి స్థానికేతరులు ప్రాతినిధ్యం వహించడం, ఓడిపోగానే ఈవైపు చూడకపోవడం పరిపాటిగా మారింది. దీంతో స్థానికంగా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టి ఇతర పార్టీలకు వెళ్లిపోవడం, బీజేపీ కండువా కప్పుకోవడంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది.

పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినా.. ఆ ప్రభావం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనిపించకపోవడం పట్ల కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఇప్పటికిప్పుడు ఎవరైనా కొత్త నాయకత్వం వస్తే బాగుండు అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed