Adani issue: అదానీ వ్యవహారంపై పార్లమెంటులో రగడ.. ఉభయసభలు వాయిదా

by Shamantha N |
Adani issue: అదానీ వ్యవహారంపై పార్లమెంటులో రగడ.. ఉభయసభలు వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాయిదాల పర్వంతోనే కొనసాగుతున్నాయి. అదానీ అంశంపై (Adani issue) చర్చ చేపట్టాలంటూ విపక్షపార్టీలు (opposition) డిమాండ్‌ చేశాయి. దీంతో, సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనప్పటికి గందరగోళ పరిస్థితులతో ఉభయసభలు గురువారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ (Lok Sabha) ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్.. లోక్‌సభలో అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ సైతం గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను నిర్వహించడానికి అనుమతించాలని విపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. అయినా కానీ లోక్‌సభలో విపక్షాల గందరగోళం కారణంగా సభా కార్యక్రమాలు కొనసాగలేదు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు వెల్‌లోకి దిగి రచ్చ సృష్టించారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ విపక్ష ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు శాంతించకపోవడంతో లోక్ సభను గురువారానికి వాయిదా వేశారు.

రాజ్యసభ వాయిదా

మరోవైపు, రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో చైర్మన్‌ ధన్‌ఖర్‌ సభను మధ్యాహ్నం 11:30కు వాయిదా వేశారు. అదానీ వ్యవహారంపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఎంపీల నినాదాల మధ్యే ఛైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. వాయిదా పడిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయ్యింది. అయినప్పిటికీ విపక్షాలు అదానీ కేసు, సంభాల్ హింసపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో, రాజ్యసభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed