- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hello Trollers, It's You.? సోషల్ మీడియాలో పులిహోర కలుపుతున్నారా.?

సోషల్‌మీడియా..
అదో ఎల్లలు లేని ప్రపంచం.
అంతులేని సమాచారం.. అవధుల్లేని పరిజ్ఞానం దాని సొంతం.!
సోషల్‌మీడియాలో ఉండేవారికి..
లైక్.. కామెంట్.. షేర్‌లే అన్నం మంచినీళ్లు.
ట్రెండింగ్.. వైరల్సే ఆభరణాలు.
కంటెంట్‌ను నమ్మినవాళ్లు పేరు.. పైసా సంపాదిస్తున్నారు.
ట్రోలింగ్ మాయలో పడ్డవారు జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు.
ఫేస్‌బుక్.. ఇన్‌స్టా.. యూట్యూబ్.. టెలిగ్రాం.. వాట్సాప్.. ఎక్స్ వై జెడ్.. ఇలా సోషల్‌మీడియా లిస్ట్ చాలానే ఉంది. మనిషి బుర్రలోని ఆలోచనలకు.. సృజనాత్మకు పదునుపెట్టే వేదికలివి. టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే ప్లాట్‌ఫామ్‌లు కూడా. సరికొత్త స్నేహ ప్రపంచంగా రోజురోజుకూ విస్తరిస్తోంది. కాలక్షేపం కోసమే కాదు సంపాదనకూ మార్గమైంది సోషల్‌మీడియా. ఊరంతా ఒక దారి.. ఉలిపికట్టెదొక దారి అన్నట్టు ఈ ప్లాట్‌ఫామ్‌ను కొందరు మిస్‌యూజ్ చేస్తూ సోషల్‌మీడియా ప్రతిష్టకు మకిలి పట్టిస్తున్నారు.
నిన్న హనీరోజ్..
హనీరోజ్ పబ్లిక్ ఫిగరే కావచ్చు. కానీ తనకూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. సోషల్‌మీడియాలో తనపై ఒక వ్యక్తి అసభ్యకర పోస్టులు పెడుతూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని ఎర్నాకుళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేస్ ఫైల్ చేశారు. హనీరోజ్‌ను బాబీ కొన్ని కార్యక్రమాలకు ఇన్వయిట్ చేశాడట. అయితే ఏవో పర్సనల్ రీజన్స్ వల్ల ఆమె వాటికి అటెండ్ కాలేదట. అంతే.. మనోడు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఆమెను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ట్రోలింగ్ షురూ చేశాడు. ఏమైంది.. ఇప్పుడు కటకటాల్లో ఊచల లెక్కబెట్టాల్సిందే.!
నేడు నిధి అగర్వాల్
ఇప్పుడు నిధి అగర్వాల్ వంతు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి తనను ఇబ్బందికి గురిచేస్తూ.. నిత్యం వేధిస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడెవరోగానీ ఏకంగా చంపేస్తా అని బెదిరిస్తున్నాడట. ఎవరికైనా భయమైతుంది కదా.? దీనివల్ల నిధి మానసిక ఒత్తిడికి గురవుతున్నా అంటోంది నిధి. అదేం పగనో మరీ.. కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడట వాడు. ఇలా ఉంది పరిస్థితి. ఒత్తిడి భరించలేక ఏదైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత.? ఆ మధ్య ఢిల్లీలో ఫేమస్ సింగర్ ఒకామె సూసైడ్ అటెంప్ట్ చేసింది. అదేంటమ్మా అలా చేశావని అడిగితే.. గుర్గామ్‌కు చెందిన వ్యక్తెవరో తనను సోషల్‌మీడియాలో వేధిస్తుంటే భరించలేక ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పింది.
ఇంతింత కాదయా..
హనీరోజ్‌గానీ.. నిధి అగర్వాల్‌గానీ.. ఇంకొకరుగానీ.. ధైర్యం చేసి బయటకొచ్చి ఇలా జరిగిందని చెప్పారు. కానీ చెప్పుకోనివారు చాలామందే ఉన్నారు. కొందరేమో విషయాన్ని పెద్దది చేస్తే సమస్య ఇంకా తీవ్రమవుతుందని ఆగిపోతున్నారు. కొందరేమో భరిస్తూ వస్తున్నారు. వీళ్లలా కాకుండా ఒత్తిడికి గురై.. ఏ చట్టాలను ఆశ్రయించకుండా.. బయటెవరికీ చెప్పుకోకుండా ఆత్మహత్య చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఎందుకు భరించాలండీ.? వాళ్లనలా ఎందుకు వదిలేయాలి.? అసలు వేధించడానికి వాడికెవరు అధికారమిచ్చారు.? చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షలు వేయిస్తేనే సోషల్‌మీడియాలో ప్రతికూలతలు తగ్గుతాయి. సమాచారాన్ని.. సృజనాత్మకతను.. నైపుణ్యాలను పంచుకోవాల్సిన సోషల్ మీడియా నుంచి ఇలాంటి వికృత చేష్టలగాళ్లను తరిమికొట్టాల్సిందే.!
చట్టాలున్నాయి రండీ.!
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించినా.. అప్రతిష్ట పాలు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సోషల్‌మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషించినా.. సైబర్ నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలుంటాయని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో తెలిపింది. భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం సెక్షన్ 78 ప్రకారం మహిళలను వేధించే వారిపై.. అప్రతిష్టపాలు చేసే వారిపై చర్యలు తీసుకోవచ్చు. వ్యక్తుల డేటా.. వ్యక్తిగత స్వేచ్ఛ.. హక్కులను కాపాడేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023 పనిచేస్తోంది. మహిళలు.. పిల్లలపై సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ రూల్ కూడా అమల్లో ఉంది.
సేఫ్ అండ్ సెక్యురిటీ
సోషల్‌మీడియాలో అనుమతి లేకుండా ఏదైనా పోస్ట్ పెట్టి వ్యక్తిగత ఇమేజ్‌కు డ్యామేజీ చేస్తే దానిని నూతన ఐటీ చట్టం ప్రకారం పరిగణనలోకి తీసుకొని సైబర్‌క్రైమ్ వాళ్లు సమస్యను సాల్వ్ చేస్తారు. అక్కడ సొల్యూషన్ దొరక్కపోతే సెంట్రల్ గవర్నమెంట్‌కు సంబంధించిన సైబర్ నిపుణులకు ఫోన్ లేదా మెయిల్ చేస్తే పరిష్కరిస్తారని చెప్తున్నారు నిపుణులు. ఆన్‌లైన్ ట్రోలింగ్.. ఆన్‌లైన్ మోసాలపై చర్యలు తీసుకొని సోషల్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను మరింత సురక్షితం చేయడమే నూతన ఐటీ చట్టం లక్ష్యమని అంటున్నారు. కాబట్టి ఒకరి వ్యక్తిగతంపై ఇష్టానుసారం పోస్టులు.. విచ్చలవిడి కామెంట్లు పెట్టేవాళ్లను క్షమించకుండా చట్టాన్ని ఆశ్రయించాలంటున్నారు.
మెసేజ్ పంపినా నేరమే..
కేరళ హైకోర్టిచ్చిన ఒక తీర్పు ఎలా ఉందో చూద్దాం. మహిళల శరీర నిర్మాణం.. ఆకృతి గురించి వ్యాఖ్యానించినా లైంగిక వేధింపులతో సమానమని ఆ కోర్టు పేర్కొన్నది. కరెంట్ డిపార్టమెంట్‌లో పనిచేసే ఉద్యోగి.. సహోద్యోగి అయిన మహిళకు అందంగా ఉన్నావనీ.. ఇంకా ఏవేవో తిక్క తిక్క మెసేజ్‌లు పంపించాడట. ఆమె సైబర్ క్రైమ్‌ను ఆశ్రయిస్తే కేసు హైకోర్టుదాక వెళ్లింది. ఏ వ్యక్తి అయినా స్త్రీని ఉద్దేశించి లైంగిక రంగుల వ్యాఖ్యలు చేస్తే లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లే అంటూ కోర్టు పేర్కొని.. ఐపీసీ సెక్షన్ 354A(1)(iv) ప్రకారం ఇది నేరమని నొక్కి చెప్పింది. అతడు పంపిన మెసేజ్‌లు కేపీ సెక్షన్ 120(o) ప్రకారం నేరమే అని నోరు మూయించింది.!
చదువుకున్నవాళ్లే..
తెలియక చేశారంటే ఏమో అనుకోవచ్చు. కానీ సోషల్‌మీడియాను అనవసర పెంటగా మారుస్తున్నలో బాగా చదువుకొని అన్నీ తెలిసినవాళ్లే ఎక్కువున్నారు. సోషల్‌మీడియా అంటే వారి దృష్టిలో వికృ చేష్టలకు వేదిక. ఏదో సరదా కోసం పిచ్చి కామెంట్లు పెడతారు. కానీ.. దానివల్ల అవతలివాళ్లకు ఎంత డ్యామేజీ అవుతుందో అర్థం చేసుకోరు.
పట్టుబడటం పక్కా
సోషల్ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ల యూజర్స్ ఉన్నారు. ఇది ప్రపంచ జనాభాలో 62 శాతం. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ను వేధింపులకు అడ్డాగా మారిస్తే ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ఐదేళ్ల శిక్ష పడుతుంది. మహిళను లక్ష్యంగా చేసుకొని దూషించడం వంటి పిచ్చి చేష్టలు చేస్తే తీస్కపోయి బొక్కలో వేస్తారు జాగ్రత్త.!