గచ్చిబౌలి టిమ్స్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

by Shyam |
గచ్చిబౌలి టిమ్స్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?
X

దిశ, న్యూస్ బ్యూరో: ఎట్టకేలకు గచ్చిబౌలిలోని టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి) ఈ నెల 25న ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం హెచ్ఆర్ సిబ్బంది నియామకం జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే ప్రారంభం కానుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా కొవిడ్ ఆసుపత్రి అనే బోర్డును తొలగించి టిమ్స్ బోర్డును పెట్టారు వైద్య సిబ్బంది. ఎయిమ్స్, నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన సూపర్ స్పెషాలిటీ ఇన్‌స్టిట్యూట్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుతానికి జనరల్ ఆసుపత్రిగా పనిచేయించాలనుకుంటోంది. ఇప్పటికే డాక్టర్లు, నర్సుల డిప్యూటేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక కొత్తగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 2,167 నర్సుల నియామక ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. వారం రోజుల్లో దీన్ని కూడా పూర్తిచేసి పేషంట్లకు సేవలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 19వ తేదీన టిమ్స్ గురించి ప్రకటన చేసి మరుసటి రోజు నుంచే వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. తొలుత దీన్ని కరోనా పేషెంట్లను ఐసొలేషన్‌లో ఉంచేందుకు వీలుగా కొవిడ్ ఆసుపత్రిగా ప్రారంభించాలనుకుంది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చొరవతో ఇది వైద్యారోగ్య శాఖ పరిధిలోకి వచ్చింది. టిమ్స్‌గా ఆవిర్భవించింది. అయితే సాంకేతికపరమైన, లీగల్ పరమైన అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతానికి జనరల్ ఆసుపత్రిగా మొదలుపెట్టాలనుకుంటోంది.

ఈ ఆసుపత్రిలో 50 ఐసీయూ బెడ్‌లతో పాటు మరో 1450 బెడ్‌లు ఉన్నాయి. ఇంతమంది పేషంట్లకు వైద్య సేవలందించేందుకు తగినంత మంది వైద్య సిబ్బంది లేకపోవడంతో జిల్లాల నుంచి 72 మంది డాక్టర్లను డిప్యూటేషన్ పద్ధతిన బదిలీచేసింది. మరో 150 మంది నర్సులను, 7 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కూడా డిప్యూటేషన్ పద్ధతిలో ఇతర జిల్లాల నుంచి బదిలీ చేసింది. దీనికి తోడు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టింట్ ప్రొఫెసర్ల హోదాలో మరో 517 మందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోడానికి ఆర్థిక శాఖ ఈ నెల 2వ తేదీన ఆమోదం తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఛెస్ట్ ఫిజియోథెరపిస్ట్, డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్, రెస్పిరేటరీ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్, లిఫ్ట్ ఆపరేటర్… ఇలా మొత్తం 148 మందిని కూడా కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది.

దాదాపు ఇవన్నీ కొలిక్కి రావడంతో ఇక హెచ్ఆర్ డిపార్టుమెంటుకు సంబంధించినవారిని కూడా రిక్రూట్ చేసుకుని ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలలవుతున్నా ఇది వినియోగంలోకి రాకపోవడంపై విపక్షాల నించి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం ఆసుపత్రిని సందర్శించి నలుగురు సెక్యూరిటీ, చెత్త కుప్ప తప్ప అక్కడ ఏమీ లేవని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇకపైన విమర్శలకు తావులేని విధంగా వైద్య సేవలను ప్రారంభించడమే ఉత్తమమని వైద్యారోగ్య శాఖ అభిప్రాయపడింది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంతో విమర్శలకు తావివ్వకుండా ఈ నెలాఖరు నుంచే ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకుంటోంది ప్రభుత్వం.

Advertisement

Next Story

Most Viewed