- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎదురుచూపులు.. వీసీల నియామకమెప్పుడు?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలు ఏడాదిన్నరగా పూర్తిస్థాయి వీసీలు లేకుండానే నడుస్తున్నాయి. ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జులుగా నియమించి నెట్టుకొస్తున్నారు. త్వరలోనే వీసీలను నియమిస్తామని విద్యా శాఖ మంత్రి, ఉన్నత విద్యామండలి అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అన్ని వర్సిటీలకు సంక్రాంతి పండుగ తర్వాత కొత్త వీసీలు వస్తారని డిసెంబరు చివరివారంలో ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ సైతం చెప్పారు. అవన్నీ ప్రకటనలుగానే మిగిలిపోయాయి. ఒక్క వీసీ కూడా నియమితులు కాలేదు.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇటీవల ఇన్‌చార్జి వీసీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. గతేడాది మే నెలలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన గవర్నర్ ఫుల్‌టైమ్ వీసీల నియామకం విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరగా వీసీలను నియమించాలని డిసెంబరులోనే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత విద్యామండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త వీసీల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.
వాటికే ఏడాది పట్టింది
అనేక విశ్వవిద్యాలయాలకు 2019 ఆగస్టు నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు లేవు. వాటిని ఏర్పాటు చేయడానికే సుమారు ఏడాది కాలం పట్టిందని గత సెప్టెంబరులో ఉన్నత విద్యా మండలి అధికారులు వివరించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అదే సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఖాళీగా ఉన్న వీసీ పోస్టులు భర్తీ కోసం అర్హత కలిగినవారి జాబితాను రూపొందించేందుకు ‘సెర్చ్ కమిటీ’లను ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఆ సెర్చ్ కమిటీలు ఎంత మందిని సూచించాయో, నియామకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో, ఎప్పటికి కొత్త వీసీలు నియమితులవుతారో అయోమయంగానే మిగిలిపోయింది. వీసీలు లేక బోధనా సిబ్బంది, స్కాలర్లు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆశించిన తీరులో అభివృద్ధి జరగడంలేదు. ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వర్సిటీలకు న్యాయం చేయలేకపోతున్నారని అంటున్నారు.
హామీలు నెరవేరలేదు
రెండు, మూడు వారాలలో వీసీల నియామకాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం 2020 ఫిబ్రవరి 19న ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఏడాది అవుతున్నా అతీగతీ లేదు. గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాసి పది రోజులలోనే వీసీల నియామకం పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్ 23న ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఓ సెమినార్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, నెల రోజులలో వీసీల నియామకంతో పాటు 1,061 టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అది ఆచరణకు నోచుకోలేదు. గత నెలలో రెండు యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా బి. నీరజ ప్రభాకర్, వెటర్నరీ యూనివర్సిటీ వీసీగా వంగూర్ రవీందర్ రెడ్డిని నియమించారు.