ప్లాస్టిక్‎పై పట్టింపేది..?

by Shyam |
ప్లాస్టిక్‎పై పట్టింపేది..?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్:

‘గ్రేటర్‎లో ప్లాస్టిక్ రక్కసిని తరిమేద్దాం.. ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందిద్దాం’ అన్న పాలకుల ప్లాస్టిక్ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. జీహెచ్ఎంసీ ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినా అమలులో విఫలమవుతుందన్న అపవాదును మూటగట్టుకుంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదనీరు సాఫీగా వెళ్లకుండా ప్లాస్టిక్ ఆటంకం కల్గించిందని పలు ప్రాంతాల్లో రుజువైంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వరద నీరును వెళ్లకుండా రోడ్లపై పారేలా చేసిందని, లోతట్టు ప్రాంతాల ముంపునకు కారణమైందని సిటీజనులు వాపోతున్నారు.

బండ కార్తీక రెడ్డి హయాంలోనే..

మహానగరంలో ప్లాస్టిక్ నిషేధానికి బండ కార్తీక రెడ్డి మేయర్ గా ఉన్నప్పుడే బీజం పడింది. ఆ తర్వాత వివిధ కారణాలతో ప్లాస్టిక్ నిషేధం అటకెక్కింది. పూర్తిస్థాయి నిషేధం కాస్తా.. తర్వాత 40 మైక్రాన్లకు పరిమితమైంది. అనంతరం దాన్ని 50 మైక్రాన్లకు తీసుకువెళ్లారు. రెండేళ్ల క్రితం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ప్రకటించాయి. దీని అమలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో మరోసారి సమావేశం నిర్వహించాయి. ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ స్ట్రాటెజీస్ (ఐజీఈఎస్) సహకారంతో దీన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. ఇక్లీ సౌత్ ఏసీయా సంస్థ కూడా ఈ కార్యక్రమ అమలులో ప్రధాన భాగస్వామిగా ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడంతోపాటు రీ సైకిల్ ప్లాస్టిక్ నే వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రకటనలు గుప్పించాయి.

జీహెచ్ఎంసీలోనే ఉల్లంఘన..

హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని, 200 మిల్లీ లీటర్ల లోపు ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించరాదని గతేడాది బల్దియా ఆదేశాలు జారీ చేసింది. ఏవైనా కార్యక్రమాల నిర్వహణలో వాటిని వాడితే బిల్లుల చెల్లింపులు ఉండవని కూడా హెచ్చరించింది. ఆయా కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడడంలేదని అండర్ టేకింగ్ ఇవ్వాలని సర్క్యులర్ పంపింది. అయినా అమలు మాత్రం జరగడంలేదు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునివ్వడం తెలిసిందే. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆదేశించారు.

జరిమానాలతోనే సరి..

ప్లాస్టిక్ నిషేధం పేరిట జీహెచ్ఎంసీ అధికారులు దుకాణాదారులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. గతేడాది కాటేదాన్‎లో ప్లాస్టిక్ వినియోగిస్తున్న మూడు దుకాణలకు రూ.1.35 లక్షల జరిమానా వేశారు. అయితే బల్దియా జరిమానాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజలకు అవగాహన కల్పించడంలో చూపడంలేదనే విమర్శలు ఉన్నాయి. ప్లాస్టిక్, దోమలపై తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్న జీహెచ్ఎంసీ ఆ తర్వాత మరిచిపోతుందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో తాజా వరదలతో ప్లాస్టిక్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్లాస్టిక్ తో అనేక అనర్థాలు ఉన్నాయని, దోమల వృద్ధికి, రోగాలకు కారణమవుతున్నాయని నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు చెరువులుగా మారేందుకు ప్లాస్టిక్​ కారణమని, నాలాల వ్యర్థాల్లో దాదా పు 40 శాతం ప్లాస్టిక్ ఉంటున్నాయని చెబుతున్నారు. ఇక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 66 శాతంగా ఉండగా, ఇవన్నీ డంపింగ్ యార్డుకు వెళ్లేలోగా చెల్లాచెదురై అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తామని యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, మంత్రి కేటీఆర్ ల సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జీహెచ్ఎంసీ పాలక మండలి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతికోసం పంపి చేతులు దులుపుకుంది.

Advertisement

Next Story

Most Viewed