భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

by Anukaran |   ( Updated:2021-05-09 08:46:25.0  )
భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’
X

దిశ, ఫీచర్స్ : COVID-19 నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్(అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్) లక్షణాలు కలవరపెడుతున్నాయి. దీన్నే ‘బ్లాక్ ఫంగస్’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మట్టి, మొక్కలు, ఎరువులో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు వంటిది) వల్ల ఇది సంక్రమిస్తుంది. మధుమేహం, మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె ఆగిపోవడం లేదా క్యాన్సర్ వంటి కొమొర్బిడిటీలను కలిగి ఉన్న బాధితులు, కొవిడ్ నుంచి బయటపడ్డ తర్వాత ఈ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు.

మ్యూకోర్ మైసిస్‌గా పిలిచే ఈ బ్లాక్ ఫంగస్ సోకితే బాధితులు ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. అవయవ మార్పిడి జరిగిన వారితో పాటు ఐసీయూలో చికిత్స పొందిన వారికి ఈ ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువ కాగా, గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. బ్లాక్ ఫంగస్ కేసులు 54 శాతం డెత్ రేటు కలిగి ఉన్నాయి. ఫంగస్ రకం, ప్రభావితమైన శరీర స్థలాన్ని బట్టి ఈ రేటు మారుతూ ఉండగా.. ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో మూడో వంతు మంది చూపు కోల్పోతున్నారు. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని సీడీసీ పేర్కొంది. దీన్ని ముందుగానే గుర్తించి యాంటీ ఫంగల్ వైద్యమందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశముందని వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్‌కు ఇంట్రావీనస్ (IV) మందుల ద్వారా లేదా శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు. యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ల ద్వారా కూడా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.

లక్షణాలు

ముఖం తిమ్మిరెక్కడం, ముక్కు ఒకవైపు నల్లబడటం, కళ్ళలో వాపు లేదా నొప్పి, పల్మనరీ(ఊపిరితిత్తుల) మ్యూకోమైకోసిస్ లక్షణాలతో పాటు జ్వరం, దగ్గు, చాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటివి ఉండవచ్చు. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయిన రోగులకు దీనివల్ల మరింత ప్రమాదం ఉంది. డయాబెటిస్, స్టెరాయిడ్స్ ఉన్న రోగులతో పాటు క్యాన్సర్, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతుండగా.. సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావితం చూపుతుంది. డయాబెటిస్ రోగుల్లోనే దీని ప్రభావం ఎక్కువ కాగా, మిగతావారిలో పెద్దగా వ్యాప్తి చెందడం లేదు.
– డాక్టర్ మౌర్య, ఫోర్టిస్ హాస్పిటల్, పల్మనాలజీ విభాగం డైరెక్టర్

Advertisement

Next Story

Most Viewed