హుజురాబాద్‌లో సీఎం టూర్.. ఈటలకు ప్లస్‌ అయిందా.?

by Anukaran |   ( Updated:2021-08-17 07:39:16.0  )
హుజురాబాద్‌లో సీఎం టూర్.. ఈటలకు ప్లస్‌ అయిందా.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ దళితులు ఆదర్శంగా నిలవబోతున్నారన్న ముఖ్యమంత్రి ప్రసంగం తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా హుజురాబాద్ బిడ్డలు ఎలా ఫీలవుతున్నారు అన్న విషయాలపై ఆరా తీసే పనిలో పడింది సర్కార్. శాలపల్లి సభ తరువాత హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లో ఎలాంటి భావన నెలకొందొనన్న విషయంపై వివిధ రకాల ఏజెన్సీల ద్వారా సర్కార్ ఆరా తీసే పనిలో నిమగ్నమైంది.

దళిత బంధు ప్రకటన తరువాత 5 నుంచి 8 శాతం మందిలో ప్రభుత్వంపై సానుకూలత నెలకొందని గ్రహించిన ప్రభుత్వం ఈ పథకంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. అయితే మీటింగ్ తరువాత దీని ప్రభావం మరింత పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ అంతగా సానుకూలత రానట్టుగా విశ్వసనీయ సమాచారం.

అదే కొంప ముంచిందా..?

శాలపల్లి సభలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించే సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్ష మందిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేఫథ్యంలో దళిత బంధు కార్యక్రమానికి ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని కూడా తరలించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రసంగం అంతా కూడా దళితుల చుట్టే తిరగడంతో సభకు వచ్చిన ఇతర సామాజిక వర్గాల వారిలో కొంత విముఖత ఏర్పడింది.

బీసీ బంధు కూడా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుండటంతో తమకు కూడా ప్రత్యేక పథకాలు అమలు చేస్తారేమోనన్న ఆశతో వచ్చిన జనానికి నిరాశే ఎదురైంది. మరో వైపున లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు. దీంతో దళితుల్లోనూ ఈ స్కీం అమలు విషయంలో కొంత నైరాశ్యం నెలకొన్నట్టుగా స్పష్టం అవుతోంది.

ఈటల ఎఫెక్టెనా.. ?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపెక్ట్ వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం కూడా కొంతమందిలో నెలకొంది. దళిత బంధు పథకం కూడా ఈ కోవలోనే అమలు చేస్తున్నారని, ఎన్నికల తరువాత అమలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు.

అంతేకాకుండా శాలపల్లి సభా వేదికపై కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా నాయకులకు అవకాశం కల్పించడం కూడా చర్చకు దారి తీసింది. లిమిటెడ్‌గా డయాస్‌పై నాయకులకు అవకాశం కల్పించే విధానానికి భిన్నంగా శాలపల్లి సభ జరగడంపై కూడా అధికార పార్టీలో మార్పు వచ్చినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed