MLC Kavitha : రాజకీయాల్లో మళ్లీ కవిత బిజీ..పూలే ఫ్రంట్..బీసీ సంఘాలతో భేటీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-24 07:52:33.0  )
MLC Kavitha : రాజకీయాల్లో మళ్లీ కవిత బిజీ..పూలే ఫ్రంట్..బీసీ సంఘాలతో భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు బీసీ ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లకముందు కవిత అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్-బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్‌(యూపీఏ), భారత జాగృతి సంస్థల తరుపునా జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. మనమెంతో మనకంతా నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తు బీసీ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న కవిత కులగణన చట్టబద్దంగా చేయాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆమె అరెస్టయి జైలుకెళ్ళారు. బెయిల్ పై విడుదలైన అనంతరం కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న కవిత మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లురుతున్నారు.

అదానీపై అమెరికాలో కేసు విషయమై ప్రధాని మోదీపై విమర్శలతో తిరిగి తన గళం వినిపించారు. శుక్రవారం జాగృతి సభ్యలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నారు. నిన్న నిమ్స్ లో చికిత్స పొందుతున్న గురుకుల బాలికను, కుటుంబాన్ని పరామర్శించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అదే ఊపులో చాలా రోజుల తర్వాత తన నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు కుల గణన డెడికేటెడ్ కమీషన్‌కు బీసీ సంఘాల సమస్యలపై నివేదిక అందజేయాలని కవిత ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా కవిత తన నివాసంలో నిర్వహించిన జాగృతి సమావేశాన్ని భారత జాగృతి పేరుతో కాకుండా తెలంగాణ జాగృతి పేరుతో నిర్వహించడం చర్చనీయాంశమైంది.

వాస్తవానికి తెలంగాణ ఉద్యమం సమయంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల అలంబనగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ ఉత్సవాల నీడన సాంస్కృతిక ఉద్యమాన్ని సాగించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ జాగృతి సారధ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఉపకోటా డిమాండ్ లేవనెత్తారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన క్రమంలో తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చేశారు. తర్వాత సామాజిక న్యాయం పేరుతో ఉద్యమం సాగిస్తుండగానే లిక్కర్ కేసులో అరెస్టవ్వడంతో జాగృతి కార్యక్రమాలు నిలిచిపోయాయి. తిరిగి మరోసారి తెలంగాణ జాగృతి కార్యక్రమాలను ఉదృతం చేయడం ద్వారా బీఆర్ఎస్ కు బలాన్నివ్వడంతో పాటు రాజకీయంగా తన సత్తాను చాటుకోవాలని కవిత ముందడుగు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed