బయో బబుల్‌లో విండీస్ బంపర్ విజయం

by Shiva |
బయో బబుల్‌లో విండీస్ బంపర్ విజయం
X

దిశ, స్పోర్ట్స్: కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ స్తంభించిపోయిన వేళ.. క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లందరూ భవిష్యత్‌లో ఆట ఎలా ప్రారంభమవుతుందని మదనపడుతున్న సమయాన.. ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ సాహసమే చేసింది. బయో బబుల్ రూపొందించి క్రికెట్‌కు సరికొత్త మార్గం చూపింది. ఈ చారిత్రాత్మక టెస్టులో పర్యాటక జట్టు అన్ని రంగాల్లోనూ రాణించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రైజ్ ద బ్యాట్ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. టెస్టు మ్యాచ్ చివరి రోజైన ఆదివారం ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 200 పరుగల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది.

తడబడినా.. నిలబడింది
ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పూర్తి ఆత్మవిశ్వాసంతో విండీస్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టింది. రెండు సెషన్లకు పైగా సమయం ఉండటం, విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శన చూసిన అనంతరం ఆతిథ్య జట్టుకు ఛేదన నల్లేరుపై నడకే అని అందరూ భావించారు. అయితే, ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్, మార్క్‌వుడ్‌లు విండీస్ టాప్ ఆర్డర్‌ను కూల్చేశారు. రెండో ఇన్నింగ్స్ 7 పరుగుల వద్ద బ్రాత్‌వెయిట్ (4), షాయ్ హోప్ (9) పెవీలియన్ చేరారు. మరోవైపు క్యాంప్‌బెల్ (1)గా వెనుగిరిగాడు. 27 పరుగుల వద్ద బ్రూక్స్ డకౌట్ అయ్యాడు. దీంతో విండీస్ వికెట్లు టపటపా రాలడం ఖాయమని భావించారు. ఆ సమయంలో జర్మానే బ్లాక్‌వుడ్ (95) ఒంటరి పోరాటం చేశాడు. ఛేజ్(37)తో కలిసి నాలుగో వికెట్‌కు 73, డోరిచ్ (20)తో కలసి ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించి విండీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. చివర్లో స్టోక్స్, ఆర్చర్‌లు విండీస్ వికెట్లు తీసి కాస్త భయపెట్టారు. కానీ కెప్టెన్ జాసన్ హోల్డర్ (14), క్యాంప్‌బెల్ (8) కలిసి లక్ష్యాన్ని ఛేదించారు.

ఈ సారి గాబ్రియేల్ వంతు
ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను తన బౌలింగ్‌తో జాసన్ హోల్డర్ (6 వికెట్లు) కుప్పకూల్చాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్స్ బ్యాట్స్‌మెన్ నిలబడ్డారు. అయితే, పేసర్ గాబ్రియేల్ (5 వికెట్లు) భారీ స్కోరుకు అడ్డకట్ట వేశాడు. 284/8 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కేవలం మరో 29 పరుగులు చేసి 313 ఆలౌట్ అయ్యింది. మిగిలిన ఆ రెండు వికెట్లను కూడా గాబ్రియేల్ తీశాడు. దీంతో టెస్టుల్లో 5 వికెట్ల ఫీట్‌ను అతను ఆరోసారి అందుకున్నాడు. పర్యాటక విండీస్ జట్టు విజయంపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. గతంతో స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టును ఓడించినా, విదేశాల్లో కరేబియన్ జట్టుకు ఈ మధ్య రికార్డులు ఏవీ బాగా లేవు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మాత్రమే విదేశీ గడ్డపై గెలిచింది. అంతకు మునుపు న్యూజీలాండ్ పర్యటనలో కూడా ఓటములే చవి చూసింది. అయితే, జాసన్ హోల్డర్ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన జట్టు ఎలాంటి అంచనాలు లేకుండా అన్ని విభాగాల్లో చక్కని ప్రతిభ కనపరిచి తొలి టెస్టులో విజయం అందుకుంది. సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు జులై 16నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానుంది.

స్కోర్ బోర్డ్ :
తొలి ఇన్నింగ్స్
ఇంగ్లాండ్ 204 ఆలౌట్
వెస్టిండీస్ 318 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్:
ఇంగ్లాండ్ 313 ఆలౌట్
వెస్టిండీస్ బ్యాటింగ్
బ్రాత్ వెయిట్ 4, జాన్ క్యాంప్‌బెల్ 8 నాటౌట్, షాయ్ హోప్ 9, బ్రూక్స్ 0, చేజ్ 37, బ్లాక్‌వుడ్ 95, డోరిచ్ 20, జాసన్ హోల్డర్ 14 నాటౌట్ (మొత్తం 200/6, ఎక్స్‌ట్రాలు 13)
వికెట్ల పతనం : 1-7, 2-7, 3-27, 4-100, 5-168, 6-189

ఇంగ్లాండ్ బౌలింగ్
(ఓవర్లు- మెయిడెన్లు-పరుగులు-వికెట్లు)
అండర్సన్ (15-3-42-0), జోఫ్రా ఆర్చర్ (17-3-45-3), మార్క్ వుడ్ (12-0-36-1), బెన్ స్టోక్స్ (10.2-1-39-2), డామ్ బెస్ (10-2-31-0)

Advertisement

Next Story