జాతి వివక్షకు వ్యతిరేకంగా విండీస్ కొత్త నిర్ణయం

by Shyam |
జాతి వివక్షకు వ్యతిరేకంగా విండీస్ కొత్త నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతున్న సమయంలోనే అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ జాత్యహంకార హత్య ఆందోళనలకు కారణమైంది. క్రీడల్లో కూడా జాతి వివక్ష ఉందని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. క్రికెట్‌లో తాను జాతి వివక్ష ఎదుర్కొన్నానని మాజీ కెప్టెన్ డానెర్ సామీ ఆరోపించాడు. ఈ క్రమంలో విండీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. లాక్‌డౌన్ అనంతరం తొలి టెస్టు మ్యాచ్ జూలై 8న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విండీస్ జట్టు జెర్సీలపై ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనే లోగోతో ఆడేందుకు సిద్ధమైంది. ఇందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా అంగీకరించినట్లు సమాచారం. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. క్రీడల్లోనూ జాతివివక్షను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, దానిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని విండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ పేర్కొన్నాడు. ‘మేం విజ్డెన్ ట్రోఫీ గెలిచేందుకే ఇంగ్లండ్ వచ్చాం. అయితే, ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు. అందరికీ సమానత్వం, సమన్యాయం అనే విషయాలపై పోరాటం జరుగుతున్నది. విండీస్ క్రికెటర్లుగా మా జట్టు చరిత్ర తెలుసు. వర్ణ వివక్షపై మాట్లాడాల్సిన సమయం ఇది. అందరికీ సమన్యాయం దక్కేంత వరకు మేం నిరసన తెలియజేయడం మానుకోం’ అని హోల్డర్ అన్నట్లు ఈఎస్‌పీఎన్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed