అత్యుత్తమ మేధావులతో కలిసి పని చేస్తున్నాం: చంద్రబాబునాయుడు

by srinivas |   ( Updated:2020-05-02 06:03:06.0  )
అత్యుత్తమ మేధావులతో కలిసి పని చేస్తున్నాం: చంద్రబాబునాయుడు
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు. ఏప్రిల్ 19న ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా బాబును జీఎఫ్ఎస్‌టీ (గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫార్మేషన్) తరఫున విలువైన సూచనలతో నివేదిక అందించారని, ఎంతో విశ్లేషణాత్మక రీతిలో సలహాలు అందించారని ప్రశంసించారు. బాబు టీం అందించిన విలువైన మద్దతుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ పేర్కొన్నారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, కరోనా కట్టడి చర్యల్లో భారత్ ప్రయత్నాలకు జీఎఫ్ఎస్‌టీ కూడా తోడ్పాటునందిస్తుండడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. కరోనా అదుపు చర్యల్లో భాగంగా తాము ప్రతిపాదించిన హాట్ స్పాట్ నమూనాలను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా ప్రశంసించారని వెల్లడించారు. ప్రపంచ అత్యుత్తమ మేధావులతో కలిసి పనిచేస్తున్నామని, కొవిడ్-19పై దేశం సాగిస్తున్న పోరాటానికి తాము ఈ విధంగా సహకారం అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

మరోవైపు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ జయంతి నేపథ్యంలో వైఎస్సార్సీపీ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతమని చెప్పారు. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయని, ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైఎస్సార్సీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు.

ఆయనను మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ ఆయన అభిప్రాయపడ్డారు. కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీలోని మీడియా ప్రతినిధులపై ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. సొంత మీడియాలో ఎవరి మీదయినా, ఎంత అసత్య ప్రచారమైనా చేసుకోవచ్చు నంటూ, వైఎస్సార్సీపీ నేతల అక్రమాలను కట్టుకథలు అల్లి కప్పిపుచ్చవచ్చు, కానీ ప్రజలకు వాస్తవాలు చెబితే మీడియా ప్రతినిధులను వేధిస్తారని మండిపడ్డారు.

మీడియా ప్రతినిధుల పై కక్షగట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం… వారి బంధువులు, మీడియాతో ఏ మాత్రం సంబంధం లేని వెంకటకృష్ణ, విద్యార్థి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఏమిటీ అరాచకం? అని అడిగారు. టీడీపీ దీనిని ఖండిస్తోందని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే టీడీపీ న్యాయ పోరాటానికి కూడా వెనుకడుగు వేయదని హెచ్చరించారు. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తామన్న బాబు, ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags: chandrababu naidu, tdp, ysrcp, ap governament, babu

Advertisement

Next Story

Most Viewed