టీకా సరఫరా పెంచుతాం: మోదీ

by Shamantha N |
టీకా సరఫరా పెంచుతాం: మోదీ
X

న్యూఢిల్లీ: టీకా సరఫరా పెంచడానికి అవిశ్రాంత కృషి జరుగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాష్ట్రాలకు 15 రోజులు ముందుగానే టీకా స్టాక్‌ను పంపించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా మహమ్మారిపై తప్పక గెలిచి తీరాలని, ఇందుకోసం ప్రజలకు సరైన సమాచారం అందించడం కీలకమని అన్నారు. పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం, వ్యాప్తి అరికట్టడానికి స్థానిక కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు ఈ పోరులో ప్రధాన అస్త్రాలు అని వివరించారు. పలురాష్ట్రాలకు చెందిన జిల్లా మెజిస్ట్రేట్‌లతో ప్రధాని మంగళవారం భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి జిల్లా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, అయినప్పటికీ కరోనాను ఓడించడమే అందరి లక్ష్యమని అన్నారు. ఈ సెకండ్ వేవ్‌లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ‘మీలో ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో అత్యంత కీలకమైనవారు. ఒకరకంగా మీరు ఫీల్డ్ కమాండర్లు. మనదగ్గరున్న అస్త్రాలు, భారీగా టెస్టులు చేయడం, లోకల్ కంటైన్‌మెంట్ జోన్లు, సాధారణ ప్రజలకు సరైన సమాచారం అందించడమే. వీటికితోడు ప్రాణాధార ఔషధాలతో కొందరు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. వాటిని నిలువరించాలి’ అని తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 46 జిల్లాలకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారుల నుంచి సలహాలను కోరారు. కరోనా పోరులో తమ అనుభవంలోకి వచ్చిన విలువైన విషయాలు, ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న విధానంలో మార్పులను వివరించాల్సిందిగా తెలిపారు. విలువైన సలహాలతో విధానాలు మరింత పటిష్టమవుతాయని అన్నారు. కరోనా నుంచి అన్ని వర్గాల ప్రజలనూ కాపాడాలని, అందుకు తగిన వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. టీకా పంపిణీపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. అలాగే, దీని చుట్టూ పేరుకున్న అపోహలను తొలగించాలనీ చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story