‘అక్రమ కేసులపై జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయిస్తాం’

by Shyam |
‘అక్రమ కేసులపై జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయిస్తాం’
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు . వనపర్తి జిల్లాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం ఫ్యాషన్ గా మారిందని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని అడిగిన పాపానికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా శనివారం ఉదయం వనపర్తి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని , న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. నియంత ప్రోత్బలంతోనే అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం కానీ ప్రశ్నించడం మాత్రం ఆపమని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి కి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ఒక్కరోజైనా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు స్కానింగ్ యంత్రాలు ఉన్నా ఎందుకోసం బయటికి రాస్తున్నారని ఆడిగామని, సమాధానం చెప్పడానికి చేతకాక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో గతంలో కూడా వైద్యంపై ప్రశ్నించినందుకు తనపై కేసు నమోదు చేశారని ఇప్పుడు కూడా వైద్యం గురించి ప్రశ్నించినందుకు మళ్ళీ కేసు నమోదు చేశారని దీన్ని బట్టి చూస్తుంటే స్కానింగ్ సెంటర్ల నుంచి డాక్టర్లతో పాటు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధికి కూడా కమీషన్లు అందుతున్నాయేమోనని అనుమానం కలుగుతుందన్నారు. అన్ని జిల్లాలో రెండువేల రూపాయలకే స్కానింగ్ చేయాలని మంత్రులు మాట్లాడి ఒప్పిస్తే వనపర్తి జిల్లాలో మాత్రం తాము ప్రశ్నించిన తర్వాత అప్పటికప్పుడు మూడు వేలకు ఒప్పించినట్లు ప్రకటనలు ఇచ్చారని , అయితే ఇతర జిల్లాలో మాదిరిగా ఇక్కడ కూడా రెండు వేల రూపాయలకే స్కానింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనడం లేదని రైతులు వాపోతున్నారని వివిధ దినపత్రికలలో చూస్తున్నామని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో కూడా రైతులను పట్టించుకోకపోవటం దారుణమన్నారు. అక్రమ కేసులు పెట్టించిన నియంత అక్రమాలపై పోరాటం ఉధృతం చేస్తామని,ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలని, లేనిపక్షంలో ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. నియంత మాటలు విని తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కూడా ఒక్కసారి నిజానిజాలు తెలుసుకోవాలని లేనిపక్షంలో అధికారులే ఇబ్బందులు ఎదుర్కొంటారు తప్ప లీడర్లు కాదన్నారు. తమపై పెట్టిన తప్పుడు కేసులపై జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement

Next Story