ఆ కిడ్నాప్‌ కేసు మిస్టరీ వీడింది

by srinivas |
ఆ కిడ్నాప్‌ కేసు మిస్టరీ వీడింది
X

దిశ ఏపీ బ్యూరో: వైజాగ్ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సురేష్‌ కిడ్నాప్‌ కేసు మిస్టరీ వీడింది. పలు మలుపులు తిరిగిన కిడ్నాప్ కేసులో ఏ1, ఏ2 నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్వవహారానికి వ్యాపార లావాదేవీలు, రైస్‌ పుల్లింగ్‌ వ్యవహారాలే కారణమని తేలింది. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్‌ ఆర్‌కే మీనా వివరిస్తూ, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సురేష్‌ను ద్వారకానగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నలుగురు కిడ్నాప్‌ చేసి సాగర్ నగర్, రుషికొండ మధ్యలో కత్తి, తుపాకీతో సురేష్‌ను బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు లేవని బంగారం ఉందని‌ సురేష్ కిడ్నాపర్లకి చెప్పాడు. వారి సూచనలతో సురేష్ తనభార్యకి‌ ఫోన్ చేసి బంగారం తీసుకు రమ్మన్నాడు. అతని భార్య బంగారం తీసుకువచ్చిన తర్వాత భార్యాభర్తలు ఆ విషయంపై ఘర్షణ పడ్డారు. దీంతో సురేష్ కొడుకు 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో కిడ్నాపర్లు పరారయ్యారు.

అనంతరం కేసులో నిందితులు పల్లపు ప్రసాద్ (ఎ 1), ప్రతాప్‌రెడ్డి (ఎ 2)‌లను అరెస్టు చేసి, విచారణ చేయడంతో ఈ కేసులో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అరెస్ట్ అయినవారిపై రైస్ పుల్లింగ్ తో పాటు పలు కేసులు ఉన్నాయన్నారు. నిందితులలో కొంతమందితో సురేష్ కి రైస్ పుల్లింగ్ ద్వారా పరిచయం ఉందని తెలిపారు. సురేష్ పైన కూడా కేసులు ఉన్నాయని వెల్లడించారు. కేసులతో పాటు డబ్బులు ఉన్నవ్యక్తిని కిడ్నాప్ చేస్తే త్వరగా డబ్బులు వస్తాయని‌ నిందితులు ఊహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ పై మూడు కేసులు ఉన్నాయి. మరో నిందితుడు ప్రతాప్‌రెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. గతంలో ప్రసాద్‌‌ కూడా రైస్‌ పుల్లింగ్‌ వ్యవహారంలో కిడ్నాప్ కి గురై మోసపోవడంతో ఈజీ మనీ కోసం అదే మార్గాన్ని ఎంచుకున్నాడని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed