వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ వాయిదా..!

by srinivas |
వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ వాయిదా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గత ఎన్నికల ముందు జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీబీఐ అధికారులను కరోనా వెంటాడుతోంది. దర్యాప్తులో నిమగ్నమైన 15 మంది అధికారుల్లో ఇప్పటికే నలుగులు వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది. అధికారులకు కరోనా సోకడంతో ఈ కేసు విచారణను నెల రోజుల పాటు వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం.

వివేకా హత్య కేసులో రెండో విడత దర్యాప్తు కోసం గత నెల సుమారు 15 మంది సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. కొన్నిరోజుల పాటు అనుమానితులను విచారించారు. అందులో భాగంగానే సీబీఐ బృందం పులివెందుల, కాణిపాకం, తిరుమల, కదిరి ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ బృందంలోని 7గురు సభ్యులు కరోనా బారిన పడి ప్రస్తుతం కడప నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ పరిస్థితుల్లో విచారణను ముందుకు కొనసాగించలేమని నిర్దారించుకుని మిగతా అధికారులు ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే కొందరు వెళ్లిపోగా, త్వరలోనే మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తాత్కాలికంగా నిలిచిపోయింది. కరోనా బారినపడిన ఏడుగురు కోలుకుని కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకున్నాక విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story