Delhi judge: నోట్లకట్టలు దొరికాయన్న ఆరోపణలు అవాస్తవం

by Shamantha N |
Delhi judge: నోట్లకట్టలు దొరికాయన్న ఆరోపణలు అవాస్తవం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్లకట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కాగా.. తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఖండించారు. మార్చి 14న అగ్నిప్రమాదం జరిగిన తర్వాత తన నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. కాలిపోయిన కరెన్సీని తీసుకెళ్లినట్లు అధికారులు కూడా చూపించలేదన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని భార్యతో కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, తన కుమార్తెకు గానీ, తన సిబ్బందికి గానీ కాలిపోయిన నగదు చూపించలేదన్నారు. తన భవనం నుండి కాలిపోయిన నగదు కుప్పలు తొలగించాయన్న ఆరోపణలు తోసిపుచ్చారు. తన స్టోర్‌రూమ్‌లో తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎటువంటి నగదును ఉంచలేదని నొక్కి చెప్పారు. అక్కడ నగదు ఉంచాలనే ఆలోచన "పూర్తిగా అబద్ధం" అని జస్టిస్ వర్మ అన్నారు. క్వార్టర్స్ దగ్గర బహిరంగంగా, అందుబాటులో ఉండే స్టోర్ రూంలో నగదు నిల్వ చేశారనే వాదనే నమ్మశక్యంగా లేదని చెప్పుకొచ్చారు.

25 పేజీల నివేదిక

మరోవైపు, జస్టిస్ వర్మ నివాసంలో నోట్లకట్టలు దొరియాన్న అంశంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ నివేదకలో సగం కాలిన నోట్ల కట్టలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే ఘటనా స్థలంలో తీసిన వీడియోలు, ఫొటోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణను కూడా జతచేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ముగ్గురు హైకోర్టు నాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్‌ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్‌. సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. కాగా, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాదాపు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డీకే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.

Next Story