- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్డు విస్తరణ అంటూ హడావుడి.. మళ్లీ యథాస్థితి

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువయ్యింది. పెరుగుతున్న షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, షో రూమ్స్ దీనికి తోడు సర్వీసు రోడ్ల అక్రమణలతో వాహనదారుల కష్టాలు షరా మామూలయ్యాయి. వారంతాల్లో అడుగుతీసి అడుగు బయట పెట్టడం కూడా కష్టంగా మారుతోంది. సర్వీసు రోడ్లలో ఛాయ్ బండ్లు, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపారాలు కొనసాగుతున్నాయి. సర్వీసు రోడ్ల అక్రమణలతో షాపింగ్ మాల్స్ కు ఇతర అవసరాల కోసం బయటకు వచ్చిన వాహనదారులు ప్రధాన రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు.
దీంతో సాయంకాలాలు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఇవన్నీ తెలిసినా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఒక్కరోజు హడావుడి చేసి, సర్వీసు రోడ్లలో ఉన్న తాత్కాలిక దుకాణాలను తరలిస్తున్నామంటూ హడావుడి చేసి మిన్నకుంటున్నారు. ఛలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులు పెడుతూ, చెంపలు వాయిస్తున్నారు కొందరు ట్రాఫిక్ పోలీసులు. కానీ రోడ్లను ఆక్రమించిన వారిని ఎందుకో ఏమీ అనకుండా చోద్యం చూస్తూ ప్రజల ట్రాఫిక్ కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
సర్వీసు రోడ్లలో ఆక్రమణల పర్వం..
శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలోని ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న సర్వీసు రోడ్లు ప్రజా అవసరాలకంటే కొందరి స్వార్దానికే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. శేరిలింగంపల్లి నుంచి మొదలు మియాపూర్ మెట్రో వరకు, అలాగే మదీనాగూడ నుండి కూకట్ పల్లి వరకు ప్రధాన రహదారి వెంట ఉన్న సర్వీసు రోడ్లలో వాహనాలు వెళ్లేందుకు, పాదాచారులు నడిచేందుకు కూడా అవకాశం లేకుండా తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కు వచ్చే వినియోగదారుల వాహనాలు, స్కూల్స్, కాలేజీల బస్సులను పూర్తిగా ఈ సర్వీసు రోడ్లలోనే నిలిపి ఉంచుతున్నారు. కొన్నిచోట్ల అయితే కనీసం సర్వీసు రోడ్డు ఉందన్న విషయం కూడా అన్నవాళ్లు లేకుండా పోయాయి. ఆక్రమణలతో సర్వీసు రోడ్లు కానరాకుండా పోయాయి.
షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు దర్జాగా ఈ రోడ్లను వాడేస్తున్నాయి. చందానగర్, మదీనాగూడ, హైదర్ నగర్, భాగ్యనగర్ కాలనీలోని పలు షాపింగ్ మాల్స్ సర్వీసు రోడ్లను పార్కింగ్ స్థలాలు గా వాడేస్తున్నాయి. ఎల్లమ్మబండ వైపు నుండి వచ్చే వాహనాలు, ముంబై హైవే మీదుగా వెళ్లే వాహనాలతో కేపీహెచ్ బీ రోడ్డు అనునిత్యం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. రోజు అక్కడే ఉండే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఫోటోస్ కొట్టడానికి పెట్టిన శ్రద్ధ, షాపింగ్ మాల్స్ యాజమాన్యాల పార్కింగ్ చేయకుండా ఆపడంపై పెట్టడంలేదు. ఇదే పరిస్థితి మియాపూర్ మెట్రో నుంచి మొదలు శేరిలింగంపల్లి వరకు కనిపిస్తుంది. ఈ దారిలో ఇరువైపుల సర్వీసు రోడ్ల ఆక్రమణలు ఉన్నాయి. అయినా ట్రాఫిక్ పోలీసులకు మాత్రం ఎందుకోగాని ఇవేమీ పట్టడం లేదు.
వీధి వ్యాపారులతో అష్టకష్టాలు..
చందానగర్ మంజీరా పైపు లైన్ రోడ్డు సాయంత్రం అయిందంటే చాలు మెయిన్ రోడ్డును మించి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. బీహెచ్ ఈఎల్ చౌరస్తా నుండి మై హోమ్స్ వరకు అలాగే మెయిన్ రోడ్డు వెంట ఉన్న సర్వీసు రోడ్డులో గంగారం నుంచి బీహెచ్ ఈఎల్ వరకు సర్వీసు రోడ్లను రెండు వైపులా మొత్తం వీధి వ్యాపారులు ఆక్రమించేశారు. రోడ్డులో ఉన్న తోపుడు బండ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేకంగా దుకాణ సముదాయం ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్డు నుండి ఖాళీ చేయించి అక్కడికి తరలించారు. కానీ తిరిగి రెండు రోజుల్లోనే యధావిధిగా మళ్లీ నెలకొల్పారు. ఇక్కడే ఓ సూపర్ మార్కెట్ ఇతర వాణిజ్య సముదాయాలు, హాస్పటల్, ఫుడ్ స్ట్రీట్ కూడా ఉండడంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మొన్న తీసేశారు.. ఇవాళ మొదలెట్టారు..
మియాపూర్ మెట్రో నుంచి గంగారం మదీనాగూడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు ఇతర దుకాణాలను చందానగర్ జీహెచ్ఎంసీ, మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు హడావుడిగా తొలగించారు. మరోసారి దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెండు, మూడు రోజులో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. వాహనదారులు కూడా ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చేశారు. కానీ ఇంతలోనే ఏమైందో మళ్లీ నాలుగవ రోజు సాయంత్రానికి మునుపటి లాగే తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఎప్పటిలాగే వెలిశాయి. కానీ ఇవేవీ ట్రాఫిక్ పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు కనబడకపోవడం వెనుక మతలబు ఏంటో అందరికీ తెలిసిందే..
చందూ యాదవ్.. సీపీఐ నాయకుడు
రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపార సముదాయాలను ఎందుకోకానీ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో రోడ్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి.