మీమ్ ట్రెండ్: విరుష్క కిడ్..ఉబ్బితబ్బిబ్బైన సోషల్ మీడియా

by Shyam |   ( Updated:2020-08-28 02:42:01.0  )
మీమ్ ట్రెండ్: విరుష్క కిడ్..ఉబ్బితబ్బిబ్బైన సోషల్ మీడియా
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మేం ముగ్గురం అయ్యాం, జనవరి 2021లో వచ్చేస్తున్నాం’ అంటూ అనుష్కశర్మ పోస్ట్ చేయగానే, ఏదో వాళ్లింట్లో కొత్త వారసుడు రాబోతున్నట్లు సోషల్ మీడియా మొత్తం ఉబ్బితబ్బిబ్బైంది. అవును… ఆ విషయం నెటిజన్ల అందరి ఇంట్లోనూ పండగే. 2017లో ఇటలీలోని మిలాన్‌లో వారి పెళ్లైన నాటి నుంచి నేటి వరకు అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ జంట అందరికీ హాట్ ఫేవరేట్. వారి ప్రతి కదలికనూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతూనే ఉంటుంది. వాళ్లిద్దరూ ఒక బ్రాండ్. వాళ్లిద్దరూ కనిపిస్తే ఒక మ్యాజిక్. అలాంటిది వాళ్లిద్దరి ప్రతిరూపం రాబోతోందని తెలిస్తే నిజంగానే అందరూ సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే కదా..నెటిజన్లు అదే చేశారు మరి!

అనుష్క ఇలా పోస్ట్ పెట్టిందో లేదో..కొత్త కొత్త మీమ్‌లు పుట్టుకొచ్చాయి. ‘లాక్‌డౌన్‌లో విరాట్ కొహ్లీ బాగానే కష్టపడ్డాడు’, ‘లాక్‌డౌన్ సరిగ్గా ఉపయోగించుకున్న జంట వీళ్లే’, ‘లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఈ వార్త ఎన్నాళ్లకు వినాల్సి వచ్చేదో’ అంటూ మీమ్‌లు వేశారు. ఇక అనుష్క డ్రెస్ గురించి కూడా చాలా మీమ్‌లు వేశారు. ఇక ఈ జంటను హార్దిక్ పాండ్యా జంటతో పోలుస్తూ కూడా మీమ్‌లు వేశారు. ఇటీవల హార్దిక్ పాండ్యా జంట కూడా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విరుష్క జంట కూడా వెల్లడించడంతో ప్రపంచంలో ఉత్తమ చేజర్ అని విరాట్ నిరూపించుకున్నట్లు జోకులు వేశారు. ఇక తర్వాత వార్త ప్రియాంక చోప్రా చెప్పాలంటూ అంతర్జాతీయ స్టార్‌ను కూడా మధ్యలోకి లాగారు నెటిజనాలు.

ఇక విరుష్క బిడ్డ భూమ్మీదకి వచ్చాక మీడియా చేసే హంగామాను కూడా ఊహించి మీమ్‌లు ట్రెండ్ చేశారు. ఇప్పటివరకు స్టార్ కిడ్ అంటూ జాతీయ మీడియా మన్ననలు అందుకుంటున్న తైమూర్ అలీ ఖాన్ క్రేజ్ తగ్గిపోయే రోజులు వస్తాయని అంచనాలు వేశారు. విరుష్క బిడ్డ కారణంగా తైమూర్ పాపులారిటీ తగ్గుతుందంటూ అతను ఏడుస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అంతేగాకుండా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల జంట రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇక వారికి పుట్టే రెండో బిడ్డ వల్ల తైమూర్ పాపులారిటీ తగ్గుతుందో లేదో తెలియదు కానీ, విరుష్క బిడ్డ వల్ల కచ్చితంగా తగ్గుతుందంటూ విశ్లేషణలు చేశారు. అంతేకదా మరి… విరుష్క బిడ్డ కడుపులో పడిందని తెలిసినపుడే ఇంత హైలైట్ చేస్తున్నారంటే, ఇక బిడ్డ భూమ్మీదకి వచ్చాక ఇంకెంత ట్రెండ్ చేస్తారో తెలియాలంటే వేచి చూడక తప్పదు!

Advertisement

Next Story

Most Viewed