T20 World cup : టీ20 వరల్డ్ కప్‌‌తో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీకి ముప్పు..!

by Anukaran |   ( Updated:2021-09-10 06:02:14.0  )
T20 World cup : టీ20 వరల్డ్ కప్‌‌తో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీకి ముప్పు..!
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌లో ఉన్నత స్థాయి ఆటగాడు. గతంలో వరల్డ్ నెంబర్‌ 1 బ్యాట్స్‌మాన్. మైదానంలో పరుగుల వరద పారిస్తూ రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్నాడు. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. కానీ, ప్రస్తుతం కోహ్లీ‌ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి.

రికార్డుల రారాజుకు చేదు గుర్తులు..

2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, ఈ సంవత్సరం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు విఫలం కావడంతో కెప్టెన్‌ కోహ్లీపై బీసీసీఐ సంతోషంగా లేనట్టు ఓ జాతీయ మీడియా నివేదికలో పేర్కొంది.

ఈ సారి వరల్డ్ కప్ గెలవకపోతే..

దైనిక్ జాగ్రాన్ నివేదిక ప్రకారం.. కోహ్లీ సేన ఈసారి టీ 20 ప్రపంచ కప్ గెలవలేకపోతే మరో కెప్టెన్ కోసం బీసీసీఐ అధికారులు చర్చించినట్టు చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఓటమి తర్వాత ఈ అంశంపై విస్తృతమైన సమావేశం జరిగిందని.. ఐసీసీ టోర్నమెంట్‌లలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విఫలం కావడంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలిపింది. జూలై ప్రారంభంలోనే.. ముంబైలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.

నమ్మకం లేకనే ధోని ఎంపిక..

ఇక బుధవారం జరిగిన అధికారిక సమావేశంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఒక మార్గదర్శకుడిగా ప్రకటించింది బీసీసీఐ. ఎలాగైనా ప్రపంచ కప్‌ను గెలవాలని.. విరాట్ సేనకు మెంటార్‌‌గా ధోనిని ఎంపిక చేశామని.. టీమిండియా మేలు కోసమే అని గంగూలీ సైతం ప్రకటించారు. అయితే, రవి శాస్త్రి, కోహ్లీ కెప్టెన్సీ కంటే ధోనిపైనే బీసీసీఐ ఎక్కువగా నమ్మకం ఉందంటూ పలువురు క్రికెట్ విశ్లేషకులు సైతం బాహాటంగా చెప్పేయడం గమనార్హం. దీంతో ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ తన కెప్టెన్సీని ఏ విధంగా నిలదొక్కుకుంటాడో అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.

టీ-20 వరల్డ్ కప్ ముందు టీమిండియాలో కెప్టెన్సీ వివాదం చెలరేగితే ఆటగాళ్లు మ్యాచ్‌పై ఎలా ఫోకస్ చేస్తారని.. ఇప్పుడెందుకు ఇదంతా అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisement

Next Story