- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఊరిలో గబ్బిలాలే అదృష్ట దేవతలు
దిశ, ఏపీ బ్యూరో: గబ్బిలాలను చూసేందుకే చాలామంది ఇష్టపడరు. అంతేకాదు అవి ఎక్కడ ఉంటే అక్కడ అశుభం అని అంటూ ఉంటారు. ఇది చాలా చోట్ల విన్నాం కూడా. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న తొలిరోజుల్లో గబ్బిలాల వల్లే వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం కూడా జరిగింది. మనుషులకు వైరస్ గబ్బిలాల నుంచే సోకిందని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో గబ్బిలాలు అంటేనే భయపడేవారు. కొంతమంది అయితే వాటిని చంపేందుకు కూడా ప్రయత్నించిన దాఖలాలు లేకపోలేదు. అయితే నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం పనసరెడ్డి పల్లి గ్రామస్తులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అంతా గబ్బిలాలు అశుభం అని భావిస్తుంటే వారు మాత్రం అదృష్టదేవతలు అంటూ చెప్పుకొస్తుున్నారు. తమ పాలిట దేవతలని వ్యాఖ్యానిస్తున్నారు. గబ్బిలాలే తమను కరోనా నుంచి రక్షించాయని చెబుతున్నారు. తమ గ్రామంలో గబ్బిలాలు ఉండడం వల్లే గ్రామంలోకి కరోనా రాలేదంటున్నారు. పగటిపూట కనిపించే గబ్బిలాలు దేవతలతో సమానమని వారు చెప్తున్నారు. ఇది విన్న ఇతర గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
నడవలూరులోనూ ఇదే పరిస్థితి..
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని నడవలూరు గ్రామంలోనూ ఇదే పరిస్థితి. గబ్బిలాలను ఆ గ్రామస్థులు గ్రామదేవతగా భావిస్తారు. వందలఏళ్ల నుంచి వాటికి పూజలు చేస్తున్నారు. గ్రామంలోకి అడుగుపెడుతున్నవారికి స్వాగతం పలుకుతున్నట్లుగా.. చెరువు కట్ట, చింతచెట్లపై ఈ గబ్బిలాలు పెద్ద సంఖ్యలో వేలాడుతూ ఉంటాయి. ఏరోజూ ఎవరికీ వీటివల్ల ఇబ్బంది కలగలేదని స్థానిక ప్రజలు చెప్తుంటారు. గబ్బిలాల అరుపులతోనే ఆ ఊరి ప్రజలు నిద్ర లేస్తారు.
చిన్నారులకు పక్షిదోషం నివారణ అవుతుందని నమ్మకం..
ఇదిలా ఉంటే నడవలూరు చింత చెట్ల మధ్యలోని ఒక చెట్టుకు చిన్నపాటి గుహలాంటి తొర్ర ఉంటుంది. సాధారణం కంటే బరువు తక్కువ ఉండటం.. కాళ్లు, చేతులు సన్నగా ఉండడం.. రాత్రి సమయాల్లో కాళ్లు పెనవేసుకుని పడుకోవడం వంటి లక్షణాలు ఉన్న చిన్నారులకు పక్షిదోషం ఉందంటారు. అలాంటి చిన్నారులను ఈ చెట్టు వద్ద స్నానం చేయించి.. పూజలు చేసి.. చెట్టు మొదలులోని తొర్రలో ఇటు వైపు నుంచి అటు.. అటు నుంచి ఇటు వైపునకు దాటిస్తుంటారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం చిన్నారికి వేసిన వస్త్రాన్ని ఆ చెట్టుకు కట్టడం ద్వారా దోష నివారణ అవుతుందని విశ్వసిస్తారు. ఈ పూజల కోసం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ గబ్బిలాలు ఇక్కడ ఉండటం తమ గ్రామం చేసుకున్న పుణ్యంగా గ్రామస్థులు భావిస్తున్నారు. అందువల్ల వాటి సంరక్షణ బాధ్యతలను గ్రామప్రజలు తీసుకుంటారు. అందుకే వీటికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం ఆ గ్రామస్తులు సహించరు. ఆ చెట్టుకే కట్టి వారిని శిక్షిస్తారంటే వారు ఎంతలా వాటిని పూజిస్తారో అర్థం చేసుకోవచ్చు.
- Tags
- bats