అనంతగిరిలో పొలిటికల్ హీట్.. ‘ఖానాపురం’ వైపే అందరి చూపు

by Shyam |   ( Updated:2021-09-14 04:23:27.0  )
trs 1
X

దిశ, అనంతగిరి : అనంతగిరి మండలంలోని రాజకీయాలు నియోజకవర్గంలో పెను చర్చకు దారితీశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ వేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ కొత్త కమిటీల నియామకాలు చేపట్టడంతో ప్రస్తుతం అనంతగిరిలో గ్రామ కమిటీలు ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి. చాలామంది పార్టీ కోసం కష్టపడిన వారు ఈ గ్రామ శాఖల కోసం పోటీ పడుతున్నారు. తదుపరి పార్టీ నిర్ణయం ప్రకారం 17 గ్రామ శాఖలను ప్రకటించారు. కానీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడి గ్రామంలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి.

గత పీరియడ్‌లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా మర్రి సంతోష్‌ను నియమించడం జరిగింది. మారిన రాజకీయ సమీకరణాల వల్ల గ్రామంలో కొంతకాలంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ఈసారి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గింజుపల్లి రమేష్ తన వర్గానికి చెందిన కంటు నరేష్ అను పేరును గ్రామ శాఖ అధ్యక్షునిగా ప్రతిపాదించాడు. దీంతో గ్రామంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇటు మర్రి సంతోష్ కూడా గ్రామశాఖ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గ స్థాయిలో అనంతగిరి మండల రాజకీయం గురించి పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు.

వ్యుహాత్మకంగా ముందుకెళ్తున్న రెండు వర్గాలు..

టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా అన్ని గ్రామాలలో కమిటీలు పూర్తి చేసినా.. మండల అధ్యక్షునికి తన సొంత గ్రామమైన ఖానాపురంలో గట్టి పోటీ ఎదురవుతోంది. బీసీలు అధికంగా ఉన్న గ్రామంలో ఇద్దరు బీసీ నేతల మధ్య పోటీ గ్రామంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏ వర్గానికి గ్రామ శాఖ దక్కుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

విరుద్ధమైన ప్రకటనలతో గందరగోళానికి తెర..

సోమవారం 17 గ్రామాలకు మాత్రమే టీఆర్ఎస్ గ్రామశాఖ ఎంపిక జరిగినట్టు సెలక్షన్ టీం సభ్యులు తెలిపారు. ఖానాపురం, శాంతినగర్ పెండింగ్‌లో ఉన్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఓ దిన పత్రికలో ఖానాపురం గ్రామశాఖ అధ్యక్షుడి ఎంపిక జరిగినట్టు వార్త రావడంతో మండల ప్రజలు, ఖానాపురం ప్రజలు గందరగోళానికి గురయ్యారు.

ఇదే విషయమై “దిశ” దినపత్రిక తరఫున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని అనంతగిరి మండల సెలెక్షన్ టీం సభ్యులను సంప్రదించగా..సెలక్షన్ టీం సభ్యుడు అనంతగిరి మండల ప్రధాన కార్యదర్శి మట్టపల్లి పుల్లయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఖానాపురం, శాంతినగర్ ఇంకా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలనలో ఉన్నాయని, ఆ గ్రామాలకు అధ్యక్షులను ప్రకటించలేదని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం ఆ ఇరు గ్రామాలకు రెండు, మూడు రోజులలో అధ్యక్షులను ప్రకటించనున్నట్టు వారు తెలిపారు. ఖానాపురం గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎంపికైనట్టు ఓ దిన పత్రికలో వచ్చిన వార్త అవాస్తవమని ఆయన ఖండించారు.

Advertisement

Next Story