ఆరో విడత హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్

by Shyam |
ఆరో విడత హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని పీసీసీఎఫ్ శోభ ఆదేశించారు. ప్రతీ అటవీ అధికారి, సిబ్బంది గ్రామ పంచాయితీ, మున్సిపల్ నర్సరీలను 15రోజులకోసారి సందర్శించాలని, స్థానిక సర్పంచ్‌, కార్యదర్శిని కలిసి రికార్డు పుస్తకాల్లో నమోదు చేయాలన్నారు. శనివారం తెలంగాణకు హరితహారం ఏర్పాట్లు, నర్సరీలు, వన్యప్రాణి సంరక్షణ తదితర అంశాలపై జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల్లో మొక్కలను తనిఖీ చేసి, రకాలు, ఎత్తును బట్టి గ్రేడింగ్, గుంతల తవ్వకం, మట్టి స్వభావానికి తగిన మొక్కలు నాటే విధానంపై స్థానిక పంచాయితీ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటన వివరాలు నోట్ కామ్ యాప్ ద్వారా ఫోటోలు తీసి పంపాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించమన్నారు. కొన్నిజిల్లాల్లోని సర్పంచ్‌లకు ఫోన్ చేసిన ఆమె, అటవీ సిబ్బంది వచ్చారా లేదా అని ఆరా తీశారు. జూన్ తొలివారంలో జరిగే పల్లెప్రగతిలో పాల్గొంటూ, 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించాలన్నారు. కంపా నిధులతో చేపట్టిన పనులు, అటవీ ప్రాంతాల్లో నీటి కుంటల ఏర్పాటు, ఇంకుడు గుంతలు, మిడతల దండుపై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించారు. లాక్‌డౌన్‌‌, వేసవి ప్రభావంతో అటవీ జంతువుల సంచారం జనావాసాల్లో పెరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు పీసీసీఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ. పర్గెయిన్, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు చంద్రశేఖర్ రెడ్డి, సునీతా భగవత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed