రోడ్డు పనులను అడ్డుకున్న గ్రామస్తులు.. పోలీసుల ఎంట్రీతో ఉద్రిక్తత

by Shyam |
Road-Works
X

దిశ, అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో కొనసాగుతున్న 161 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు, ఇండ్లను కోల్పోతున్న తమకు సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ బాధితులు రోడ్డు పనులను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు.

మండలంలోని గాండ్ల బాయ్ తండాకు చెందిన పలువురికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వాణిజ్య సముదాయానికి సంబంధించిన నష్టపరిహారం వ్యవహారంలో మండల అధికారులు తమకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలంటూ పలుమార్లు మండల, జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నామని, కానీ తమ గోడును ఎవరు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.

అల్లాదుర్గం చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న 36 మందిలో 31 మందికి సంబంధించిన నష్టపరిహారాన్ని అధికారుల ఆదేశాలతో పెంచారని అన్నారు. మిగిలిన వారికి పరిహారం పెంచకుండా అన్యాయం చేస్తున్నారని, అధికారులు చేసిన తప్పుకు తమకు చాలా నష్టం జరుగుతోందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇదే విషయమై అల్లాదుర్గం తాహసీల్దార్ సాయగౌడును వివరణ అడగ్గా నష్టపరిహారం విషయంలో ఐదుగురికి సంబంధించి జిల్లా కలెక్టర్ తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story