వరవరరావు, సాయిబాబా ప్రాణాలను కాపాడాలి

by Anukaran |   ( Updated:2020-07-22 10:12:57.0  )
వరవరరావు, సాయిబాబా ప్రాణాలను కాపాడాలి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: రెండేళ్లుగా ముంబయి జైలులో విచారణ ఖైదీగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న సుప్రసిద్ద రచయిత వరవరరావు ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాలకు కవులు, రచయితలు, కళాకారులు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 520మంది కవులు, రచయితలు, కళాకారులు సంతకాలతో కూడిన లేఖను బుధవారం విడుదల చేశారు. జయధీర్ తిరుమల్ రావు, గోగు శ్యామల, అల్లం నారాయణ, అల్లం రాజయ్య, ఓల్గా, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, జి.కళ్యాణ్ రావు, రమా మేల్కొటే, భూమన్, రివేరా, హెచ్ ఆర్కే, డాక్టర్ పసునూరి రవీందర్, సుద్దాల అశోక్ తేజ, విమల, విమలక్క, కాత్యాయని విద్మహే, వాసిరెడ్డి నవీన్, ఏలె లక్ష్మణ్, కత్తి మహేష్, నలిగంటి శరత్, సూరేపల్లి సుజాత తదితర కవులు, రచయితలు, కళాకారులు 520 మంది పేర్లతో లేఖను పంపారు. దేశానికి అద్భుతమైన సాంస్కృతిక సంపద వరవరరావు అని, అరవై ఏండ్లుగా భారతీయ సాహిత్య, సామాజిక రంగాల్లో నిరంతరం ప్రజల పక్షాన నిలిచారని పేర్కొన్నారు. ఈయన రచనలు భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీషు, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి భాషల్లోనూ అనువాదం అయ్యాయని అన్నారు.

భీమా కోరేగావ్ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 22నెలలుగా ముంబయి జైలులో విచారణ ఖైదీగా దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వివరించారు. ఆయన కేసు విచారణ ఏమాత్రం ముందుకు సాగడం లేదన్నారు. కానీ, బెయిల్ పిటీషన్ మాత్రం తిరస్కరిస్తున్నారని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు మంచి వైద్యం అదించడంతో పాటు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం బెయిల్ పొందడం ఆయన హక్కు అని గుర్తు చేశారు. తన సొంత పనులు చేసుకోలేని స్థితిలో ఆయన్ని నిర్భంధించడం అమానవీయం అన్నారు. అంతే కాకుండా 80 ఏళ్ల వృద్దుడిగా ఉన్న వరవరరావుకు కరోనా సోకినట్టు తెలిపారు. ఈ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన వరవరరావుకు కుటుంబ సభ్యుల తోడు అవసరం అన్నారు. మానవతా దృష్టితో ఆలోచించి వరవరరావును విడుదల చేయాలని కోరారు.

నాగపూర్ అండా జైల్లో 90 శాతం అంగవైకల్యంతో, 19రకాల ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్న మరో కవి, రచయిత, మేధావి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను పెరోల్ మీద గానీ, బెయిల్ పై గానీ విడుదల చేయాలని కోరారు. వారి జీవించే హక్కును కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద ఉందని గుర్తుచేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాజకీయ ఖైదీలుగా ఉన్న ప్రజాస్వామిక వాదులందర్నీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed