రూ.కోట్లు కుమ్మరించిన మహిళ స్కెచ్.. భార్య చనిపోయిన భర్తలే టార్గెట్

by Bhoopathi Nagaiah |
రూ.కోట్లు కుమ్మరించిన మహిళ స్కెచ్.. భార్య చనిపోయిన భర్తలే టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్ : దొంగతనాలు, మోసాలు చేయడంలో రోజురోజుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఒకరు దొంగచాటుగా ఇళ్లల్లోకి వెళ్లి లూఠీ చేస్తుండగా.. మరి కొందరు ఆన్ లైన్‌లో దోచేస్తున్నారు. ఇంకొందరు పెళ్లి పేరుతో ఛీటింగ్‌కు పాల్పడుతూ మూడు ముళ్లు.. ఆరుగురు పెళ్లిలు అన్న చందంగా కోట్ల రూపాయలను దోచేస్తున్నారు. ఈ మాదిరిగా నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 50 మంది యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేయగా.. తాజాగా ఓ మహిళ పదేళ్లుగా ఇదే విధమైన మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది. వీరిందరి మోసాలసకు మ్యాట్రిమోనీ(Matrimony) సైట్లే కేరాఫ్ కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కి గత పదేళ్లుగా మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో రెండో వివాహానికి వరుడు కావాలని తన ప్రొఫైల్ పెడుతుంది. తనకు వచ్చిన ప్రొఫైల్స్‌లో భార్య చనిపోయిన భర్తలను ఎంచుకుంటుంది. అందులోనూ ధనవంతులనే ఎంపిక చేసుకుంటుంది. ఇలా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఏదో ఒక గొడవకు దిగి విడాకులు అంటూ సెటిల్ మెంట్‌కు వెళ్తుంది. ఇలా ఇప్పటి వరకు కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ నిత్య పెళ్లి కూతురు ఆటకట్టించారు పోలీసులు.

2013లో మొదటిసారి తన మోసానికి తెరలేపిన సీమా.. ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. కొద్ది నెలలు కాపురం చేశాక.. భర్త, అత్తమామలపై వేధింపుల కేసు పెట్టి రూ.75 లక్షలు నొక్కేసింది. ఆ తర్వాత 2017లో గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత పలు కారణాలు చెప్పి రూ.10 లక్షలకు సెటిల్ మెంట్ చేసుకుంది. దీని తర్వాత 2023లో జైపూర్‌కు చెందిన బిజినెస్ మెన్‌ని పెళ్లాడింది. ఏడాది కాపురం తర్వాత రూ.36 లక్షల నగదుతోపాటు నగలు తీసుకోని ఇంట్లో నుంచి ఊడాయించింది. షాక్‌కు గురైన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీమా బాగోతం బయటపడింది.

సీమా నిత్య పెళ్లి కూతురుగా అవతారం ఎత్తి తరచూ ఇలాంటి మోసాలకే పాల్పడుతుందని పోలీసులు పేర్కొన్నారు. కానీ మోసపోయిన అందరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. సీమా వివిధ రాష్ట్రాల్లో ఈ నేరాలకు పాల్పడిందని వెల్లడించారు. ఆమె ఇప్పటి వరకు రూ.1.25 కోట్లను పెళ్లీల పేరుతో కొల్లగొట్టిందని తెలిపారు. సీమా ఏ రాష్ట్రంలో ఎవరిని పెళ్లి చేసుకోని ఎంతమేర మోసం చేసిందనేది విచారణలో తేలుస్తామన్నారు. సీమా అలియాస్ నిక్కి.. మ్యాట్రిమోనీ పెళ్లిలపై కేసు నమోదు చేశామని త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని జైపూర్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story