- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. భారీగా తరలివస్తున్న కన్నడ భక్తులు

దిశ న్యూస్, శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం మహా క్షేత్రం ముస్తాబయింది. తమ ఆడపడుచు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సారే సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్నారు. ఉగాది మహోత్సవాలు పురస్కరించుకొని శ్రీశైలంలో ఐదు రోజుల పాటు భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు పది లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా భక్తులకు ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి నుంచి 31 వ తేదీ వరకు ఉగాది మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఈఓ శ్రీనివాస రావు సిబ్బంది భక్తుల ఏర్పాట్ల పనులలో నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆలయంలో నేటి ఉదయం యాగశాల ప్రవేశం తో ఉగాది మహోత్సవాలకు ఈఓ శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. మొదటిరోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రకి బృంగివాహనంపై స్వామి అమ్మవార్లు శ్రీశైలం పురవీధులలో విహరించనున్నారు.
మహాక్షేత్రంలో 5 రోజుల పాటు జరుగనున్న ఈ మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ భక్తులు తండోపతండాలుగా భక్తిశ్రద్ధలతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. శ్రీగిరి మల్లయ్య ఆదుకో మమ్మాదుకో అంటూ నల్లమల కొండలు దాటుతూ కోరిన కోరికలు తీర్చాలని ఆర్తీతో మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఆకలి దప్పికలు మరచి భక్తి శ్రద్ధలతో కన్నడిగులు పాదయాత్ర చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్ఛంద సేవకులు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా భక్తుల ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ మంచినీళ్లు అల్పాహారం భోజన వసతి భక్తులకు ఏర్పాటు చేశారు. అలసిన భక్తులకు అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి అధికారులు సేవకు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.
శ్రీ భ్రమరాంబ దేవిని కర్ణాటక రాష్ట్రం వాసులు ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకొని వెంకటాపురం అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండలు కోనలు దాటుకొని శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ ఏడాది భ్రమరాంబా దేవి సన్నిధికి కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు.