- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
DCC: ఢిల్లీలో ఏఐసీసీ భేటీతో డీసీసీల్లో పెరిగిన కాన్ఫిడెన్స్.. ఇక నేరుగా మార్జిన్ ఫండ్స్

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అడుగులు వేస్తోంది. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి దేశాన్ని పాలించే దిశగా పయనింపజేయాలని ఏఐసీసీ సంకల్పంచింది. ఈ క్రమంలోనే పార్టీని కింది స్థాయి నుంచి పటిష్ఠం చేయాలని ఫిక్సయింది. దీంతోనే ముందస్తుగా పార్టీకి దూతలు.. రక్షణ రేఖలుగా భావిస్తున్న (డీసీసీ) జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పవర్ ఫుల్ రోల్ ప్లే చేసేలా అధినాయకత్వం ప్లాన్ చేసింది. అనకున్నట్టుగానే దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న డీసీసీలను ఢిల్లీకి ఆహ్వానించింది.
ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రతిపక్షనేత, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వీరికి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ తదితరులు మీటింగ్‌కు హాజరయ్యారు. ఏఐసీసీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఏఐసీసీ అధినాయకత్వం డీసీసీలతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయిన దాఖలాలు లేవు. ఇటీవల అగ్రనాయకత్వం డీసీసీలతో భేటీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కీలక పరిమాణం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సాధారాణ విషయం కాదని, తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు కాంగ్రెస్‌కు శుభపరిణామాలని పార్టీ వర్గీయులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో పవర్‌తో జోష్..
అడపాదడపా చాన్స్ వచ్చినప్పుడల్లా తమ గొంతు వినిపించే నేతలు ఏండ్ల కొద్ది కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో కాంగ్రెస్ రూపురేఖలు మారాయి. లీడర్లు తలోదారి చూసుకున్నారు. ఆ టైంలో మరుగునపడిన కాంగ్రెస్‌ను వై.ఎస్.రాజశేఖరరెడ్డి తిరిగి పవర్‌లోకి తీసుకురావడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని భావించారు. కానీ, తర్వాత ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం, చివరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓకే చెప్పినా పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బతగిలింది. తెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ర్టంలో అధికారం చేజిక్కించున్న బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు మరింత డ్యామేజీ అయింది. పార్టీలోని హేమాహేమీలు సైతం తమకు అనుకూలమైన శక్తుల వైపు పయనించారు. దీంతో ఏండ్ల కొద్ది కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న వారిని గుర్తించిన పరిస్థితులు లేవు. ఇక అంతపోయిందనుకున్న తరుణంలో కాంగ్రెస్ తెలంగాణలో పవర్‌లోకి రావడం.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో నయా జోష్‌ను నింపింది. అయితే, కాంగ్రెస్ పాలన అందుబాటులోకి వచ్చి 15 నెలలయినా కింది స్థాయి లీడర్లు, కార్యకర్తల్లో ఎక్కడో వెలితి ఉందని.. దానికి కారణం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికంగా లోడ్ అవ్వడమేనని సీనియర్ డీసీసీ అధ్యక్షులు ఒకరు తెలిపారు.
పార్టీ అగ్ర నేతలను డీసీసీలు కలిసే చాన్స్
ఏఐసీసీ అగ్రనాయకత్వం నేరుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం కావడం.. కింది స్థాయిలో ఏం జరుగుతుంది..? ఎలా ముందుకెళ్లాలో తెలియజెప్పాలని అడగడం వంటి అంశాలు తమలో ఆత్మవిశ్వాసం పెంచాయని ఢిల్లీలో భేటీకి హాజరైన డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలానికి గుర్తింపునివ్వడమే కాకుండా ప్రత్యేకించి అధికారాలు కట్టబెట్టి హోదా పెంచిందంటున్నారు. ఏఐసీసీ నుంచి నేరుగా ఆదేశాలు అందుతాయని అధిష్ఠానం సూచనలు చేసిందంటున్నారు. ఒకవేళ అవసరమైతే స్వయంగా అగ్రనేతలను కలిసే చాన్స్ ఉన్నదని తెలియజేశారన్నారు. పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కీలకంగా వ్యవహరించాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపు వంటివాటిలో పీసీసీ అధ్యక్షుడితో పాటు ఆయా జిల్లాల అధ్యక్షుల ప్రతిపాదనలనూ ఏఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది. జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలకు ఏఐసీసీ మార్జిన్ ఫండ్స్ డైరెక్టుగా డీసీసీ ప్రెసిడెంట్స్ అకౌంట్స్‌లో జమ కానున్నాయి. డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఫండ్స్ సమకూర్చుకోవాలని అగ్రనేతలు సూచించారు.
సోషల్ మీడియాపై ఏఐసీసీ సూచనలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలని, ఎప్పటికప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, పాలిటిక్స్, ఇతర అంశాలపై పట్టు సాధించాలని ఏఐసీసీ పెద్దలు ప్రధానంగా ప్రస్తావించారని డీసీసీ ఒకరు తెలిపారు. అన్ని జిల్లాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేసుకోని పార్టీ బలోపేతానికి ముందుకెళ్లాలని, జిల్లాలతోనే అగిపోకుండా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులపై అవగాహన పెంచుకుని, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారని వెల్లడించారు.
డీసీసీల పనివిధానంపై సమగ్ర చర్చ
వచ్చే నెల 8, 9వ తేదీల్లో అహ్మదాబాద్‌లో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల పని విధానంపై సమగ్రంగా చర్చించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై దాడి, సవాళ్లు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను చర్చించేందుకు సమావేశాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంతో సమావేశం ప్రారంభమవుతుంది. 9న ఏఐసీసీ ప్రతినిధుల మీటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇది వరకే ప్రకటించారు. మీటింగ్స్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ ఆఫీస్ బేరర్లు, పార్టీ సీనియర్ లీడర్లు, ఇతర ఏఐసీసీ ప్రతినిధులు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
కాంగ్రెస్ సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర
మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం, రక్షించడం, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించిందని కేసీ వేణుగోపాల్ నొక్కిచెప్పారు. జనవరి 26, 2025, జనవరి 26, 2026 మధ్య.. కాంగ్రెస్ సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర అనే పేరుతో దేశవ్యాప్తంగా ఒక భారీ ప్రజా ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు, గాంధీ జన్మస్థలమైన గుజరాత్‌లో ఏఐసీసీ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఆయన సత్యం, అహింస, న్యాయం అనే ఆదర్శాలకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తామని వేణుగోపాల్ తెలిపారు.