Amith shah: ఇది మోడీకి అతిపెద్ద విజయం.. రాణా అప్పగింతపై అమిత్ షా!

by vinod kumar |   ( Updated:2025-04-09 18:37:13.0  )
Amith shah: ఇది మోడీకి అతిపెద్ద విజయం.. రాణా అప్పగింతపై అమిత్ షా!
X

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను అమెరికా ఎట్టకేలకు భారత్‌కు అప్పగించింది. యూఎస్‌లో చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయనను భారత అధికార బృందానికి అప్పగించారు. దీంతో రాణాను తీసుకొచ్చేందుకు వెళ్లిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు ప్రత్యేక విమానంలో రాణాను ఇండియాకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఆ విమానం ఢిల్లీకి చేరుకోనుంది. తహవూర్ భారత్ వచ్చాక ఆయనను ఢిల్లీ కోర్టు ఎదుట హాజరుపర్చే అవకాశం ఉంది. అంతకుముందు తనను భారత్‌కు అప్పగించొద్దంటూ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అమెరికాకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేశారు. రాణా భారత అధికారుల కస్టడీలో ఉన్నారని అమెరికా సైతం ధ్రువీకరించింది. రాణాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఎన్ఐఏ, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

తీహార్ జైలులో ఉండనున్న రాణా

రాణాను ఇండియాకు తీసుకొచ్చాక తీహార్ జైలులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నట్టు సమాచారం. రాణాలో ఢిల్లీలో దిగిన వెంటనే ఆయనను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారికంగా అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించనున్నారు. అక్కడ అతని బసకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాణాను తరలించనున్న దృష్యా జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ముందు రాణాను హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల రిత్యా ఆయనను వర్చువల్ గానే హాజరుపర్చే చాన్స్ ఉంది.

మోడీకి అతిపెద్ద దౌత్య విజయం

తహవూర్ రాణా భారతదేశానికి తిరిగి రావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రాణాను అప్పగించడం ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన అతిపెద్ద దౌత్య విజయమని అభివర్ణించారు. విచారణ, శిక్షను ఎదుర్కోవడానికి ఆయనను ఇక్కడకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో అధికారంలో ఉన్నవారు రాణాను విచారణ ఎదుర్కొనేందుకు భారతదేశానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఎట్టకేలకు రాణా భారత్‌కు రావడం మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని కొనియాడారు. అంతకుముందు తహవ్వూర్ రాణాను అప్పగించడంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story