ఐజీకి లేఖ రాసిన వామన్ రావు తండ్రి.. కీలక విషయాలు వెల్లడి

by Sridhar Babu |
ఐజీకి లేఖ రాసిన వామన్ రావు తండ్రి.. కీలక విషయాలు వెల్లడి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల హత్య ఘటనపై వామన్‌రావు తండ్రి కిషన్ రావు నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 17న జరిగిన ఈ హత్య కేసులో అసలు నిందితులను తప్పించారంటూ, ఇందులో భాగస్వామ్యం ఉన్న వారిపై విచారణ చేపట్టాలని పలుమార్లు కిషన్ రావు డిమాండ్ చేశారు. మీడియా ముందు కూడా చెప్పిన ఆయన పోలీసు అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 16న వరంగల్ ఐజీకి పంపిన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు ప్రారంభినట్టుగా తెలుస్తోంది. తన కొడుకు, కోడలు హత్య వెనుక జడ్పీ చైర్మన్ పుట్టా మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన పూదరి సత్యనారాయణ గౌడ్ ఉన్నట్లు లేఖలో కిషన్ రావు పేర్కొన్నారు.

ఈ హత్యకు గ్రామ కక్షలు, దేవాలయ వ్యవహారం కానేకాదని, తనకు కూడా ప్రాణ హాని ఉందని జనవరి 28న రామగుండం పోలీస్ కమిషనర్, మంథని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి నా కొడుకుపై కక్ష పెంచుకున్నాడని, ఈ హత్యలో స్థానిక నేతలు, అధికారులతో పాటు పెద్ద తలకాయల పాత్ర ఉందని ఆరోపించారు. జైల్లో ఉన్న కుంట శ్రీనివాస్ గుంజపడుగులో నిర్మించే నూతన గృహం.. ఎవరు నిర్మిస్తున్నారు, డబ్బులు ఎవరు ఇస్తున్నారో ఆరా తీయాలని అన్నారు.

జైల్లో ఉన్న నిందితులను కలిసిన వారిని కూడా విచారించాలని కోరారు. లక్కేపురం విజయ బాస్కర్, గట్టు విజయ్ కుమార్, ఆయన కుమారుడు వినయ్, ఆటోడ్రైవర్ వేలాది రఘురామ్‌ల కాల్ డేటాను పరిశీలించాలని తెలిపారు. నా కొడుకు మంథనికి వస్తున్న విషయం ఎవరికీ తెలియదని, గ్రామ సర్పంచ్ రాజుకు మాత్రమే తెలుసని కిషన్ రావు వివరించారు. హత్య తర్వాత సర్పంచ్ ఇప్పటి వరకు మమ్మల్ని పరమర్శించలేదని, నిందితుడు కుంట శ్రీను తమ్ముడు సర్పంచ్ కుంట రాజుతో పాటు అధికారుల పాత్ర కూడా ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యకు గురైన తరువాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమారున్ని, కోడలిని తీసుకెళ్లిన ప్రైవేటు అంబులెన్స్‌లో వైద్యం అందించలేదని, హత్యకు కారకులైన వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కిషన్ రావు డిమాండ్ చేశారు. నిందితుల కాల్ డేటాతో పాటు, తాను చెప్తున్న వారి కాల్ డేటాను సేకరించినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed