తెలంగాణలో స్టాక్ ఉన్నా.. వ్యాక్సిన్ కొరత

by Shyam |
తెలంగాణలో స్టాక్ ఉన్నా.. వ్యాక్సిన్ కొరత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యాక్సిన్ స్టాక్ ఉన్నప్పటికీ లబ్దిదారులకు క్షేత్ర స్థాయిలో అందడం లేదు. మొదటి డోసు వ్యాక్సిన్ వేసేందుకు వ్యాక్సిన్ సెంటర్ నిర్వహకులు నిరాకరిండంతో ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్రం లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి 1.59 కోట్ల డోసులు సరఫరా కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.38కోట్ల డోసులను వినియోగించారు. దాదాపుగా 21లక్షల వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నప్పటికీ లబ్దిదారులకు వ్యాక్సిన్ కరువైంది. వ్యాక్సిన్ లేదంటూ ప్రభుత్వం వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నారు. రోజుకు 2 లక్షల వరకు వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 1.5 లక్షలతోనే సరిపెడుతున్నారు.

వ్యాక్సిన్ సెంటర్లకు సరిపడా వ్యాక్సిన్లను సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లు మూపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ అందించేందుకు దాదాపుగా 1100 వరకు వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గత పదిరోజుల నుంచి సగానికి పైగా వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తుంది. వ్యాక్సిన్ కోసం వెళ్లిన ప్రజలకు స్టాక్ లేదని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. కేంద్ర వెల్లడించిన లెక్కలకు, రాష్ట్రంలో వినియోగించిన వ్యాక్సిన్ డోసులకు తేడా ఉండటంతో వ్యాక్సిన్ లభ్యత ఉన్నాకాని ప్రభుత్వం అందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రానికి 1.59కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా

దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ వినియోగంపై కేంద్ర ఆరోగ్కశాఖ వివరాలను వెల్లడించింది. రాష్ట్రాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్ డోసులు, వీటిలో కేంద్రం ఉచితంగా సరఫరా చేసిన వ్యాక్సిన్, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులు కొనుగొలు చేసిన వ్యాక్సిన్ డోసుల లెక్కలను ప్రకటించింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు 1.59 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా అయినట్టుగా కేంద్రం వెల్లడించింది. వీటిలో కేంద్ర ఉచితంగా 1.06 కోట్లు వ్యాక్సిన్ ను పంపిణీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 9.25లక్షల డోసులు కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు 43.59 లక్షల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసినట్టుగా వివరించారు.

రాష్ట్రంలో 21లక్షల వ్యాక్సిన్ డోసుల లభ్యత

మొదటి విడుత వ్యాక్సిన్‌ను 1,10,38,678 మందికి, రెండవ విడుత వ్యాక్సిన్‌ను 28,03,337 మందికి మొత్తం 1,38,42,015 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రంలో పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ వినియోగంపై అందించిన వివరాలతో పోల్చుకుంటే ప్రస్తుతం 21లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. రోజుకు రెండు లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం 1.5లక్షల వ్యాక్సిన్ డోసులను మాత్రమే పంపిణీ చేస్తుంది. అదనంగా దాదాపు రెండు వారాలకు సరిపడా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నప్పటికీ మొదటి విడుత వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తుంది.

Advertisement

Next Story