- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా టీకా మళ్లీ షురూ.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్ల వృద్ధులకు టీకాల పంపిణీ సోమవారం ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే లభించనుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం సర్వీసు చార్జి రూ.100తో కలిపి రూ.250లకే లభించనుంది. రాష్ట్రం మొత్తం మీద 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కేంద్రాలను నెలకొల్పినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధానాలపై అన్ని జిల్లాల వైద్యాధికారులకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య విభాగం డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్సులో వివరించారు.
డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రాల్లో అబ్జర్వేషన్ రూమ్, వెయిటింగ్ హాల్, వీల్ చైర్ తదితరాలను ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులకు తోడుగా వస్తున్న వారికీ సీటింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రతీ కేంద్రంలో ఒక వైద్య నిపుణుడ్ని అందుబాటులో ఉంచామన్నారు. సైడ్ ఎఫెక్టులు వచ్చినా, ఎలర్జీ లక్షణాలు బైటపడినా, రియాక్షన్లు వచ్చినా డాక్టర్లు అక్కడికక్కడే పరీక్షించి వైద్య చికిత్స అందిస్తారని, అవసరాన్ని బట్టి సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారని తెలిపారు.
పకడ్బందీగా లబ్ధిదారుల రిజిస్ట్రేషన్
టీకాలు తీసుకోవాలనుకునే వారు విధిగా ‘కొవిన్-2.0’ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ సౌకర్యం సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. లేదా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకాలు తీసుకోవచ్చని వివరించారు. వయసును ధ్రువీకరించే ఏడు గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకదాన్ని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు డాక్టర్ సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వీటి ఆధారంగా వారిని లబ్ధిదారులుగా గుర్తించి టీకాలు ఇస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే వైద్య సిబ్బంది వారిని గైడ్ చేస్తారని, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ‘ఆశా’ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ హెల్త్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు ఉచితమేనని నొక్కిచెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు ఎవరెవరికి ఇచ్చిందీ వివరాలను హెల్త్ డిపార్టుమెంటుకు పంపాల్సిందేనని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని 45 ఆసుపత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ఎంప్యానెల్ చేసిన కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ (సెంట్రల్ గవర్నమెంటు హెల్త్ స్కీమ్) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.
నేడు మంత్రి ఈటలకు టీకా
వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ సోమవారం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోనున్నారు. నిజానికి రాష్ట్రంలో తొలి టీకాను ఆయనే తీసుకోవాలని భావించినా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోకపోవడంతో ఆయన తీసుకోలేకపోయారు. వ్యాక్సిన్ పట్ల హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లలో భయాందోళనలు, అనుమానాలు నెలకొన్న సమయంలో తొలి టీకాను తానే తీసుకుని ఆదర్శంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు 45 ఏళ్ల వయసు పైబడిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారి కేటగిరీలో మంత్రి ఈటల రాజేందర్ టీకా తీసుకోనున్నారు.