త్వరలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ

by Shyam |
Vacancies of ration dealers
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాల్ని పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో ఉన్నతాధికారులు, రేషన్ డీలర్ల అసోసియేషన్ తో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత బియ్యం పంపిణీ, రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విపత్తు వేళ పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రేషన్ డీలర్లకు పెండింగ్ లో ఉన్న రూ.56.7కోట్ల బకాయిలను విడుదల చేశామని చెప్పారు. గతేడాదిన్నర కాలంగా నెలకొన్న గడ్డుపరిస్థితుల్లో అర్ధాకలితో ఎవరూ అలమటించకూడదని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని రేషన్ డీలర్లు నిర్వీరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. డీలర్లపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాల్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.

రేషన్ డీలర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతిపాదనలు, విధివిదానాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలలో 15కిలోల ఉచిత బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, బియ్యం పక్కదారి పట్టకుండా సరఫరా చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంపిణీకి అవసరమైన 4లక్షల 31వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధంగా ఉంచామని, 87,42,590 కార్డుదారులకు 5 నుంచి పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని, విధినిర్వహణలో బాధ్యతతో వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అధికారులు, రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed