రేవంత్‌‌కు పీసీసీ ఇస్తే.. నేను పార్టీలో ఉండను : వీహెచ్

by Anukaran |
రేవంత్‌‌కు పీసీసీ ఇస్తే.. నేను పార్టీలో ఉండను : వీహెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు టీపీసీసీ పదవిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే.. తాను పార్టీలో ఉండలేనని అన్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని స్పష్టం చేశారు. తనతో పాటు చాలామంది నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని అన్నారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేసే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు టీపీసీసీ చీఫ్ పదవికి పనికిరారా? అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి టీపీసీసీ ఎలా ఇస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు కొత్త వాళ్లకు ఇస్తే.. మేం మాత్రం జైలు చుట్టూ తిరగాలా అని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉండి రేవంత్ ఆ పార్టీనే ఖతం చేశాడని… ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా రేవంత్‌రెడ్డి ఖతం చేస్తాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఢిల్లీని కూడా రేవంత్‌ మేనేజ్ చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల్లో రేవంత్‌ రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్‌ ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతుంటే.. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తికి పీసీసీ ఇస్తారా అని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి కింద తాను పనిచేయలేనని అన్నారు. రేవంత్‌రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. పీసీసీపై ఉత్తమ్‌ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంతేగకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లు తీసుకున్న రేవంత్‌ అందులో ఎన్ని గెలిపించుకున్నారని విరుచుకుపడ్డారు. 2018 నుంచి కాంగ్రెస్ హైకమాండ్ తనకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. ఓ వర్గం తనను హైకమాండ్‌ను కలవకుండా చేస్తోందని ఆరోపించారు.

Advertisement

Next Story