సీఎం మాటలు పచ్చి అబద్దాలు : ఉత్తమ్

by Sridhar Babu |
సీఎం మాటలు పచ్చి అబద్దాలు : ఉత్తమ్
X

దిశ, కరీంనగర్
వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. 2014లోనే కోటీ 5 లక్షల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని, గత ఆరేళ్లలో అంత పెద్ద ఉత్పత్తి మళ్లీ రాలేదని గుర్తుచేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ఈ విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కందుల రైతులకు రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. బత్తాయి ఇతర రాష్ట్రాలకు పంపొద్దని సీఎం చెప్పారని, బత్తాయిని బార్డర్ దాటనీయకపోవడంతో ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది 40 వేలకు టన్ను పలకిన బత్తాయి, ఇప్పుడు పది వేలకు కూడా ఎవరూ కొనడం లేదని, ఇందుకు సీఎందే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులను ఆదుకోకపోతే సమస్య సీరియస్ అవుతుందన్నారు. పసుపు పంటంతా కోల్డ్ స్టోరేజీలోనే ఉందని, ఇంకా మార్కెటింగ్ ప్రారంభం కాలేదన్నారు. కోటి నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనాలంటే 20 కోట్ల గన్నీ సంచులు కొనాలన్నారు. తాము పరిశీలించిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కడా సంచులు లేవని, సివిల్ సప్లై కార్పోరేషన్ చినిగిన సంచులు సప్లై చేసిందని ఆరోపించారు. గన్నీ సంచి బరువు కేవలం 650 గ్రాములుంటే 2 కిలోల అదనపు తూకం ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో ఇంత మంది మంత్రులుండి రైతులకు సమస్యలొస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రైతులకు జరుగుతున్న మోసాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం 2 కిలోల అదనపు తూకం వేస్తుంటే సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ 42 కిలోలు తూచి పంపిస్తే అక్కడ మాత్రం 40 కిలోలు మాత్రమే రిసీవ్ చేసుకున్నట్లు చూపిస్తున్నారని, ఇది సివిల్ సప్లై మినిస్టర్ కు తెలియదా అని అడిగారు. ధాన్యం సరఫరా చేసే లారీలు మిల్లుల ముందు ఎన్ని గంటలు వేయిట్ చేయిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తాము రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవాలని ప్రయత్నిస్తే సీఎం మాపట్ల చులకనగా మట్లాడాతున్నారని ఆరోపించారు. ఎదురుదాడికి దిగకుండా ఇప్పటికైనా 42 కిలోల ధాన్యం తూకం వేసే విధానాన్ని బంద్ చేయాయాలని హితవు పలికారు. ప్రతిపక్షాల పట్ల, పాత్రికేయుల పట్ల చులకనగా మాట్లాడే తీరు సీఎం అహంకారానికి నిదర్శనమన్నారు.

Tags: Tpcc chief, Uttam Kumar reddy, Karimnagar, crop purchase center

Advertisement

Next Story