- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డ్రాగన్’ కట్టడికి 18 సూత్రాల కార్యాచరణ
దిశ, వెబ్ డెస్క్: అమెరికా, చైనాల మధ్య కరోనా వైరస్ పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. వైరస్ పుట్టుకకు చైనానే కారణమని, దాని నిర్లక్ష్య ఫలితమే అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనానికి పునాదని భావిస్తోంది. సాధ్యమైనంతగా చైనాపై ఆంక్షలు విధించి డ్రాగన్ దేశాన్ని ఏకాకి చేయాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఇప్పటికే చైనాపై విధించే ఆంక్షలకు సంబంధించిన బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టింది. అంతకు ముందు చైనాపై మరింత ఒత్తిడి పెంచేలా 18 సూత్రాల కార్యాచరణను అమెరికా రూపొందించింది. అమెరికన్ సెనేటర్ థామ్ టిలిస్ రూపొందించిన ఈ కార్యాచరణలో అనేక ముఖ్యమైన అంశాలకు చోటు కల్పించారు. అందులో ముఖ్యమైనది సైనిక బంధాలను బలోపేతం చేసేది. ప్రస్తుతం అమెరికాతో న్యూట్రల్‌గా వ్యవహరిస్తున్న భారత్, తైవాన్, వియాత్నం వంటి దేశాలకు తమ ఆయుధ సామాగ్రిని అందుబాటులో ఉంచాలని, తమ మిత్ర దేశాలతో సైనిక బంధాన్ని బలోపేతం చేయాలని అమెరికా నిర్ణయించింది. దీనిలో భాగంగా 20 బిలియన్ డాలర్ల నిధులతో ఒక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసి ‘పసిఫిక్ డిటెరెన్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించాలని భావిస్తోంది. మిత్రదేశమైన జపాన్ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం అందించి, దక్షిణ కొరియాతో పాటు జపాన్‌కు ఆయుధాలు విక్రయించాలని నిర్ణయించింది. చైనా చుట్టూ ఉన్న బలమైన దేశాలతో సైనిక బంధాలను ఏర్పాటు చేసుకోవడం అమెరికా ప్రణాళికలో ముఖ్యమైన వ్యూహం కాబోతోంది. చైనాకు మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్‌ను కూడా ఉగ్రవాద ఏరివేత కార్యక్రమంలో భాగస్వామిగా చేసి దాని మిలటరీనీ అమెరికా అదుపులోనే పెట్టుకుంది. ఇలాగే మిగిలిన చిన్న దేశాలతో కూడా సైనిక ఒప్పందాలు కుదుర్చుకోవాలనేది అగ్రరాజ్యం వ్యూహం.
వ్యాపార సంబంధాలపై సమీక్ష
అమెరికా, చైనా మధ్య ఉన్న వ్యాపార, వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించాలనేది కార్యాచరణలో మరో ముఖ్యమైన అంశం. అమెరికాకు చెందిన ఉత్పత్తి సంస్థలు తమ యూనిట్లను చైనా నుంచి తిరిగి స్వదేశానికి రప్పించాలని, తద్వారా సరఫరా చైన్‌ను తెగ్గొట్టి చైనాపై ఆధార పడటం తగ్గించాలని అమెరికా యోచిస్తోంది. ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్న హువాయే వంటి టెలికాం సంస్థలపై ఉన్న నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఈ నిషేధాన్ని తమ మిత్ర దేశాలు కూడా అమలు చేసేలా చూడాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హువాయే సంస్థ సైనిక గూఢచర్యానికి పాల్పడిందని ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఆ సంస్థపై నిషేధం విధించింది. దీంతో పాటు రుణాల పేరుతో చైనా ఇతర దేశాలను మభ్యపెట్టి చేస్తోన్న మోసాలను బయటపెట్టాలనీ, అవసరమైతే ఆయా దేశాలను చైనా రుణాల నుంచి విముక్తులు చేసే మార్గం కనిపెట్టాలని కార్యాచరణలో పేర్కొన్నారు. 2022లో చైనాలో జరగబోయే శీతాకాల ఒలంపిక్స్ వేదికను అక్కడి నుంచి మార్చేలా వ్యూహం రచించాలని అనుకుంటోంది.
ఇంటెలిజెన్స్ బలోపేతం..
అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ‘ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ చట్టం’ సమూలంగా మార్పులు చేయాలని ఆ దేశం అనుకుంటోంది. ఇకపై అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో కూడా కలిసి పని చేయాలనేది దాని వ్యూహం. ఇండియా, పాకిస్తాన్, దక్షిణ కొరియా వంటి దేశాల నిఘా వ్యవస్థలతో పని చేయడం ద్వారా మరింత సమాచారాన్ని సేకరించాలని అనుకుంటోంది.
కరోనా వైరస్‌కు కారణమైన చైనాను అన్ని రకాలుగా ఏకాకిని చేసి దానికి జవాబుదారీగా నిలబెట్టేందుకే ఈ 18 సూత్రాల కార్యాచరణ రూపొందించినట్లు థామ్ టిలిస్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణపై మిత్ర దేశాలతో విస్తృతంగా చర్చ జరుపుతామని ఆయన అన్నారు. చైనా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే వైరస్ వ్యాప్తికి సంబంధించిన అంశాలను దాచిపెట్టిందని, పర్యవసానంగా ప్రపంచం బాధపడుతోందని ఆవేదన చెందారు. చైనాపై ఆంక్షలు విధించకుంటే అది ప్రపంచ దేశాలకు మరింత ముప్పుగా మారే అవకాశం ఉండటం వల్లే ఈ కార్యాచరణను రూపొందించామని స్పష్టం చేశారు.