జార్జి ఫ్లాయిడ్ హత్య కేసు : ‘ఊపిరి’ తీసిన పోలీసే దోషి

by vinod kumar |
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసు : ‘ఊపిరి’ తీసిన పోలీసే దోషి
X

న్యూయార్క్ : అమెరికాను ఓ కుదుపు కుదిపి వర్ణ వివక్ష గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా చేసిన జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో అతడి ‘ఊపిరి’ని నొక్కిపట్టిన పోలీసు అధికారే దోషి అని తేలింది. ఈ మేరకు మిన్నియా పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. సుమారు 11 గంటల పాటు విచారణ జరిగిన ఈ కేసులో.. ఫ్లాయిడ్ ఘటనను సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, నరహత్యగా పేర్కొంటూ కోర్టు తీర్పునివ్వడం గమనార్హం.

గతేడాది మే 25న నకిలీ నోట్లు తీసుకెళ్తున్నాడనే ఆరోపణతో ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ (46) ను అమెరికా పోలీసు డెరెక్ చౌవిన్ రోడ్డుపై పడుకోబెట్టి అతడి మెడపై మోకాలితో గట్టిగా తొక్కిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఫ్లాయిడ్.. తనకు ఊపిరి ఆడటం లేదని, కాలు తీయాలని ఎంతగా ప్రాధేయపడ్డా చౌవిన్ కనికరించలేదు. ఫలితంగా ఫ్లాయిడ్ అక్కడికక్కడే ‘ఊపిరి’ వదిలాడు. ఫ్లాయిడ్ మరణానంతరం యూఎస్‌లో ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్’ పేరిట జరిగిన ఊరేగింపులు, నల్లజాతీయుల ఆందోళనలు అగ్రరాజ్యాన్ని గడగడలాడించాయి. వారి ఆందోళనల ఉధృతితో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న విషయం తెలిసిందే. యూఎస్ తో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ లలోనూ పలు ఆందోళనలు జరిగాయి.

కాగా.. ఈ కేసు విచారణ అనంతరం దోషిగా తేలిన డెరెక్ చౌవిన్ ముఖంలో తాను తప్పు చేశానన్న భావన ఏ కోశానా కనిపించలేదు. చౌవిన్‌కు ఇంకా శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఫ్లాయిడ్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఎదుట నల్లజాతీయులు భారీ ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశారు. విచారణ ముగిశాక జార్జి ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లను కలిశారు.

Advertisement

Next Story