చమురు సరఫరాలో సౌదీని దాటేసిన అమెరికా

by Harish |
చమురు సరఫరాలో సౌదీని దాటేసిన అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ అవసరాలకు అత్యధికంగా ముడి చమురును సరఫరా చేస్తున్న దేశాల్లో అమెరికా రెండో స్థానానికి చేరుకుంది. గత నెల వరకు ఈ స్థానంలో సౌదీ అరేబియా ఉండగా, ఇటీవల చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధించడంతో అమెరికా నుంచి మన దేశం భారీగా కొనుగోలును పెంచింది. అంతేకాకుండా, అమెరికా చమురు ధర కూడా తక్కువగానే ఉండటంతో సౌదీ అరేబియా రెండో స్థానం నుంచి కిందకు జారింది. ఇటీవల అమెరికాలో చమురు డిమాండ్ తగ్గిపోవడమే కాకుండా ధర తక్కువ కావడంతో భారత్ ఎక్కువ మొత్తంలో చమురును కొనుగోలు చేసింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి దేశాలు ఒకరోజుకు మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించాయి.

ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో అమెరికా నుంచి భారత్‌కు చమురు దిగుమతి 48 శాతం పెరిగింది. ఇది భారత్‌కు దిగుమతి అవుతున్న మొత్తం చమురులో అమెరికా 14 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే, సౌదీ అరేబియా నుంచి దిగుమతులు ఫిబ్రవరిలో 42 శాతం క్షీణించాయి. సౌదీ నుంచి ఈ స్థాయిలో చమురు దిగుమతులు తగ్గడం దశాబ్దంలోనే మొదటిసారి. 2006 అనంతరం భారత్‌కు చమురు సరఫారా చేసే జాబితాలో సౌదీ మొదటిసారిగా 4వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఇరాక్ ఉంది. ఇరాక్ నుంచి చమురు ఎగుమతి 23 శాతం తగ్గినప్పటికీ మొదటిస్థానంలోనే ఉంది.

Advertisement

Next Story

Most Viewed