ఊరకుంటకు ఎసరు.. వెంచర్ ఏర్పాటుకు యత్నం

by Shyam |
ఊరకుంటకు ఎసరు.. వెంచర్ ఏర్పాటుకు యత్నం
X

దిశ, జడ్చర్ల: రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలు కాపాడేందుకు కోట్ల రూపాయలు వేచ్చిస్తున్నా.. కానీ అక్రమార్కుల చెర నుంచి కాపాడుకోలేక పోతున్నది. భూములకు డిమాండ్ పెరగడంతో స్థిరాస్తి వ్యాపారులు చెరువులు కుంటలను అక్రమ దారిలో కబ్జాలు చేస్తున్నారు. తాజాగా కావేరమ్మపేట వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఊరకుంట కాల్వను పూడ్చి వెంచర్ ఏర్పాటుకు పనులు చేపట్టారు. ఇప్పటికే కొందరు భూములు కూడా కొనుగోలు చేశారు. భూములను కొన్నవారు కాల్వను అనుకొని వెంచర్ వేయడానికి మట్టి తరలిస్తున్నారు. ఏకంగా కాలువను పూడ్చి వేసే ప్రయత్నం చేస్తున్నారు.

పట్టా భూమి కొనుగోలు చేసి..

జడ్చర్ల పురపాలికలోని కావేరమ్మపేట ఊరకుంటకు అధికారులు 2016లో మరమత్తు పనులు చేపట్టారు. రూ.17లక్షలతో తూము కాల్వను నిర్మించారు. ప్రస్తుతం అక్కడే కొంత దూరంలో వెంచర్ ఏర్పాటు చేసిన రియల్ వ్యాపారులు కుంట కట్టకు సమీపంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. కుంట కట్ట కింద ప్లాట్లు వేయడానికి కాలువను మూసేస్తున్నారు.

నిబంధనలు గాలికి..

భూమిలో వెంచర్ ఏర్పాటు చేయాలంటే ముందుగా నీటిపారుదల రెవెన్యూ శాఖ, పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు తీసుకోవాలి. ఒకవెళ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కట్ట, కాల్వల జోలికి వెళ్లకుండా నిర్దేశించిన దూరంలో మాత్రమే పాట్లు చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా వెంచర్ ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కుంట కట్ట కింద వెంచర్ ఏర్పాటు చేస్తే నీళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. నిబంధనలు అతిక్రమించి వెంచర్ వేస్తే ఓ వైపు కుంట మనుగడకు ముప్పువాటిల్లితుండగా మరోవైపు ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే కుంట నీటితో ఎన్నటికైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story