- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాచకురాలిగా మారిన యూనివర్సిటీ పట్టభద్రురాలు
దిశ, వెబ్‌డెస్క్ : హరిద్వార్‌లోని రైల్వేస్టేషన్, బస్టాండ్ ఆవరణలో గల ఫుట్‌పాత్‌లపై ఓ భిక్షగత్తె.. తన కొడుకు, కూతుర్లతో జీవనం సాగిస్తోంది. తనను ఎవరైనా మాట్లాడిస్తే అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ.. తన బిడ్డలకు ఇంగ్లీష్, హిందీలో మెళకువలు నేర్పిస్తుండటం తాజాగా మీడియా దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే తన మానసిక పరిస్థితి బాగా లేదని, తనకు సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించింది. తాను మామూలు స్థితికి వస్తే తన కుమారుడిని బాగా చదివించాలని అనుకుంటున్నట్లు సదరు లేఖల్లో పేర్కొన్నట్లు తెలిపింది. ఉన్నత విద్యావంతురాలైన తను ఇప్పుడిలా యాచకురాలిగా మారడానికి కారణమేంటి? అసలు ఆమె ఎవరు? ఆమె కథేంటి?
ఉత్తరాఖండ్‌లోని రాంఖిలా గ్రామానికి చెందిన హన్సీ ప్రహరి.. ఆంగ్ల భాషలో మంచి పట్టున్న విద్యార్థి. అక్కడి కుమావూ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సబ్జెక్టులో డబుల్ ఎంఏ చేసింది. ఆమె ఆంగ్లంలో మాట్లాడుతుంటే.. ఆ వాగ్దాటికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కాలేజీలో ఏ కార్యక్రమమైనా, డిబేట్ అయినా.. హన్సీ స్పీచ్ లేనిదే పూర్తి కాకపోయేది. ప్రతిభావంతురాలైన హన్సీ తన వాక్‌చాతుర్యంతో విద్యార్థి నాయకురాలిగా ఎదిగింది. విశ్వ విద్యాలయంలోనే నాలుగు సంవత్సరాల పాటు లైబ్రేరియన్‌గా, ఆ తర్వాత బయట కూడా పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. రాజకీయాలపైనా మంచి అవగాహన కలిగిఉన్న హన్సీ.. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్ టమ్‌టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ఆమె జీవితం మారిపోయింది.
వైవాహిక జీవితంలో ముసురుకున్న వివాదాలు, కష్టాల కారణంగా ఆమె మానసికంగా కృంగిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఏ ఉద్యోగం చేయలన్నా.. తన మానసిక స్థితి సహకరించలేదు. దాంతో ఆమె కడుపు నింపుకోవడానికి యాచకురాలిగా మారింది. తన కొడుకు, కూతురుతో సహా పబ్లిక్ ప్లేసుల్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. తన మానసిక స్థితి బాగా లేదని తనకు సహకరించాలని ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు లేఖలు రాసింది కానీ.. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు స్పందించలేదు. 2012 నుంచి ఆమె భిక్షాటనతోనే కాలం గడుపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు సహకరించి తన ఆరోగ్యస్థితిని బాగు చేస్తే.. తన పిల్లలకు మంచి విద్యను, భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఒకప్పటి విద్యార్థి నాయకురాలు, ఇంగ్లీష్ పట్టభద్రురాలు, యూనివర్సిటీలో మంచి పేరున్న విద్యార్థి.. పరిస్థితుల ప్రభావంతో యాచకురాలిగా మారినా, మళ్లీ తన బిడ్డల కోసం మామూలు స్థితికి రావాలని కోరుకుంటున్న ఆమెను ప్రభుత్వమే ఆదుకోవాలా? ప్రస్తుత టెక్ యుగంలో.. సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలిసిందే. ఇటీవలే ఎంతోమంది హోటల్ నిర్వాహకులు తమకు గిరాకీ లేదంటే.. ఆ విషయాన్ని వైరల్ చేసి, వారి జీవితాలను మార్చేసిన సంఘటనులు చూస్తున్నాం. మరి.. హన్సీకి కూడా సోషల్ మీడియా ద్వారా అయినా సాయం అందాలని కోరుకుందాం.