గ్లోబల్ కాదు ఫ్లడ్ సిటీగా మార్చారు: ప్రకాశ్ జవదేకర్

by Anukaran |   ( Updated:2020-11-22 05:24:02.0  )
గ్లోబల్ కాదు ఫ్లడ్ సిటీగా మార్చారు: ప్రకాశ్ జవదేకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, అసదుద్దీన్ కుటుంబాలే పరిపాలనను సాగిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ గత ఆరేండ్లలో 6 వైఫల్యాలంటూ బీజేపీ రూపొందించిన ఎన్నికల చార్జిషీట్‌ను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ…కేసీఆర్ కుటుంబం, వారి సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప నగర సమస్యలు పరిష్కాం కావడం లేదని విమర్శించారు.

ఇటీవల వచ్చిన వరదల వల్ల 15 రోజులు హైదరాబాద్ నగరం నీళ్ళలోనే ఉండిపోయిందని, వారి పాలనకు ఇదే నిదర్శనమన్నారు. కనీసం సరైన డ్రైనేజీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. గ్లోబల్ సిటీ అని చెప్పి… ఫ్లడ్ సిటీగా మార్చారని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాలు అంటూ హామీలు ఇచ్చినవి నీటి మూటలయ్యాయని విమర్శించారు. వరద సాయం సొమ్ములో సగం తెరాస నాయకుల జేబుల్లోకి వెళ్ళిందన్నారు. రెండు పడక గదుల ఇండ్లు లక్ష కడతామని, వెయ్యి కూడా కట్టలేదని, ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశారనీ చెప్పారు.

అవినీతికి చిరునామా…?

కేసీఆర్ ఆరేండ్ల పాలన అవినీతికి చిరునామాగా మారిందని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్‌లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్ తాగుతున్నారా?. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారని చెప్పుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకమని.. సుష్మా స్వరాజ్ లేకపోయినా ఆమె పోరాటం మర్చిపోలేమని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరకీ తెలుసు’అని అన్నారు. హైదరాబాద్ మేయర్‌గా భాజపా అభ్యర్థి కావాలా..? ఎంఐఎం అభ్యర్థి కావాలా… ? నగర ప్రజలు ఆలోచించాలని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కృషి ఉందని జవదేకర్ అన్నారు. కానీ, టీఆర్ఎస్ కుటుంబ పాలన కోసం కాదన్నారు.

మేయర్ పీఠం బీజేపీదే…

హైద్రాబాద్ నగర మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని ప్రకాశ్ జవదేకర్ జోస్యం చెప్పారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపాడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, హరీశ్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు. అక్కడ వీచిన బీజేపీ బలమైన గాలులు నగరంలోనూ వీస్తున్నాయని నగర ప్రజల ఉత్సాహాన్ని చూసి చెప్పొచ్చని చెప్పారు.

Advertisement

Next Story