బిగ్ బ్రేకింగ్: కిషన్ రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ షెడ్యూల్ ఫిక్స్

by Anukaran |   ( Updated:2021-08-14 01:46:10.0  )
Union Minister Kishan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆగష్టు 19 నుండి 21 వరకు కోదాడ నుండి హైదరాబాద్ వరకు కొనసాగనుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 19 నుండి కోదాడలో ప్రారంభమై ఆగస్టు 21న హైదరాబాద్‌లో ముగించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సూచన మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించిందని చెప్పారు. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. సూర్యాపేటలో రాత్రి బస చేస్తారు. ఈ జన ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.

మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్‌లో భద్రకాళి మాత దర్శనం, వరంగల్, హనుమకొండలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఖిల్లాషాపూర్‌లో సర్వాయి పాపన్న గ్రామం నుండి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటారని పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న విధానాన్ని పరిశీలిస్తారని చెప్పారు. ఆలేరులో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు(కార్మికులు) చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించి యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేయనున్నారని పేర్కొన్నారు. 21న ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం విధానాన్ని ప్రజలకు చేరుతుందా? లేదా? అనే అంశాల నేపథ్యంలో రేషన్ షాప్ సందర్శించి పరిశీలిస్తారని చెప్పారు.

అనంతరం ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాత్రి 7 గంటలకు సభ ఉంటుందని తెలిపారు. ఈ ‘జన ఆశీర్వాద యాత్ర’లో రాష్ట్ర బీజేపీ కీలక నేతలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, డాక్టర్ కె. లక్ష్మణ్, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. 12 జిల్లాల మీదుగా, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా, 324 కిలోమీటర్లు జన ఆశీర్వాద యాత్ర జరుగుతుందని వివరించారు. ఈ యాత్రలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ తరపున విజ్ఞప్తి చేశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.. మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ప్రధాని మోడీ రైతాంగానికి లాభసాటి చేసే విధంగా విధానాలు రూపొందించడం, పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ – అభివృద్ధి విషయాలను కిషన్ రెడ్డి యాత్రలో ప్రధానంగా ప్రస్తావిస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగడమే ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం.’’ – బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి

Advertisement

Next Story

Most Viewed