ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఆపొద్దు: కేంద్ర మంత్రి జైశంకర్

by Shamantha N |
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఆపొద్దు: కేంద్ర మంత్రి జైశంకర్
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అనేక ఆరోపణలు, విమర్శలు, వాదోపవాదాలు వెలువడ్డాయని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అలా జరిగి ఉండాల్సింది కాదని తెలిపారు. కొందరు ఎన్నికలు జరపొద్దని, వాటిని నిలిపేయాలని వాదించారనీ ప్రస్తావించారు. కానీ, ఆ వాదనలు సరికావని కొట్టిపారేశారు. ‘మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను ఆపొద్దు కదా. అందుకే వాటిని అడ్డుకోలేదు’ అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ అభిప్రాయపడ్డారు.

అది సహాయం కాదు.. ఫ్రెండ్‌షిప్

దేశంలోని సంకట పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడటానికి కేంద్ర విదేశాంగ మంత్రి తన శాయశక్తుల కృషి చేస్తారని జైశంకర్ అన్నారు. వీలైనన్ని దేశాలతో సంప్రదింపులు జరిపారని, ప్రాణాధార వైద్య పరికరాలు, ఆక్సిజన్ కొరత గురించి మాట్లాడారని తెలిపారు. మీడియా పిలుస్తున్నట్టు దాన్ని సహాయం అని తాము పిలవమని, తాము దాన్ని ఫ్రెండ్‌షిప్ అంటామని పేర్కొన్నారు. కొవిడ్ ఏ ఒక్క దేశానికో పరిమితమైనది కాదని తెలిపారు. అందుకే హడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును యూఎస్, సింగపూర్, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలకూ భారత్ పంపించిందని గుర్తు చేశారు. టీకాలను కొన్ని దేశాలకు పంపామని చెప్పారు. అదే విధంగా ఇతర దేశాలూ భారత్‌కు అవసరమైన వాటిని పంపిస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story