- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గొంగిడి’ పదవులపై చిన్న గులాబీల గుస్సా!
దిశ నల్లగొండ: నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసి, ఆయన పేరును సీల్డ్ కవర్‌లో పంపింది. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. అయితే, ఆయన భార్య సునీత ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. మహేందర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో దంపతులిద్దరికీ పార్టీలో ప్రాధాన్యత పెరిగినట్టే అయిందనీ, ఆ దంపతులిద్దరికీ పదవులిచ్చి..మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులను పక్కన పెట్టడం సబబేనా అంటూ..ఉమ్మడి నల్లగొండ జిల్లా గులాబీ పార్టీ కార్యకర్తలు అధిష్టానం పట్ల గుస్సా అయినట్టు తెలుస్తోంది.
మహేందర్ రెడ్డిని డీసీసీబీ చైర్మన్‌గా అధిష్టానం ఎంపిక చేయడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత వాపోయినట్టు సమాచారం. పార్టీ అవిర్భావం నుంచి పని చేస్తోన్న వారు, ఉద్యమంలో కృషి చేసిన వారు నామినేటేడ్ పదవుల కోసం ఆరేండ్లుగా కండ్లకు కాయాలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం కోసం ప్రగతి భవన్ చుట్టూ పచార్లు కొడుతున్నారు. అధికార పార్టీకి ప్రతిపక్షమనేదే లేకుండా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ సీనియర్ నాయకులను గులాబీ గూటికి చేరుస్తున్న వారు, చేరిన వారు రాజకీయ భవితవ్యం కోసం ఎదురు చూస్తోన్నారు. వీరందరినీ పట్టించుకోకుండా ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు కట్టబెట్టడమేంటనీ గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సహకార ఎన్నికల్లో ఓయూ ఉద్యమ నేత పల్లా ప్రవీణ్‌రెడ్డి బరిలో దిగి దేవరకొండ పీఏసీఎస్ చైర్మెన్‌గా గెలుపొందారు. కేటీఆర్ హమీ మేరకే ఆయన సహకార ఎన్నికల బరిలో దిగారనీ, ఆయన డీసీసీబీ చైర్మన్ పదవి ఖాయమనీ ప్రచారం కూడా జరిగింది. చైర్మెన్ పదవి కాకపోయినా వైస్ చైర్మన్‌గానైనా పదవి దక్కించుకోవడం ఖాయమని ప్రవీణ్ అనుచరులు ధీమా వ్యక్తం చేశారు. కానీ, వారికి చివరికి నిరాశే మిగిలింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గౌడ సామాజిక వర్గం సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత గౌడ సామాజిక వర్గం నాయకులు ఎవ్వరూ పైస్థాయి ప్రజాప్రతినిధుల హోదాల్లో లేరు కాబట్టి అది పూడ్చేందుకు సుంకరి మల్లేశ్‌కు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వాలని బూర, మంత్రి జగదీశ్‌రెడ్డి వర్గీయులు ఆశించారు. భువనగిరి నియోజకవర్గ నాయకులు లింగం యాదవ్, మిర్యాలగూడ నాయకులు రంగాచార్య కూడా చైర్మన్ పదవి వస్తోందని ఆశలు పెట్టకున్నారు. కానీ, అధిష్టానం సీల్డ్‌కవర్‌తో వీరంతా భంగపడ్డారు.
ఆధిపత్య పోరు..కలిసొచ్చిందా!
డీసీసీబీ చైర్మెన్ ఎన్నిక విషయంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సాగిన ఆధిపత్య పోరుకు బ్రేక్‌లు వేయడానికి సీఎం కేసీఆర్ గొంగిడి మహేందర్‌రెడ్డిని చైర్మెన్‌గా ఎంపిక చేసినట్టు పింక్ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోన్నది. నల్లగొండ, సూర్యపేట జిల్లాలకు చెందిన సుంకరి మల్లేశ్, జానయ్యయాదవ్‌ల్లో ఎవ్వరికో ఒక్కరికి ఈపదవి కట్టబెట్టి తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని మంత్రి పావులు కదిపినట్టు తెలుస్తోన్నది. అయితే, మంత్రి ఎత్తుగడను చిత్తు చేసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేటీఆర్‌కు అత్యంత దగ్గరగా ఉండే పల్లా ప్రవీణ్ పేరును డీసీసీబీ చైర్మెన్ కోసం తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం సాగుతోంది. ఇద్దరి మధ్యన సాగుతున్న ఆధిపత్య పోరు వల్ల మూడో వ్యక్తికి చాన్స్ దొరికినట్టైంది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తన భర్త మహేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించాలని గులాబీ ఎమ్మెల్యేలను కోరడంతో పాటు అధినేతను సైతం అభ్యర్థించిందని సమాచారం. దీంతో జిల్లాలోని గులాబీ ఎమ్మెల్యేలు మెజార్టీగా మహేందర్‌రెడ్డి పేరును బలపరుస్తూ మంత్రికి తమ అభిప్రాయం తెలిపారు. ఈ ముగ్గురి పేర్లను జిల్లా మంత్రి సీఎం కేసీఆర్‌కు పంపించగా అందులో గొంగిడి మహేందర్‌రెడ్డి పేరు అధిష్టానం ఎంపిక చేసింది. ఇది జిల్లాలోని గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అసంతృప్తి మిగిల్చిందని పలువురు కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు.