'మినిమలిస్ట్' బ్రాండ్ కొనే ప్రయత్నాల్లో హిందూస్తాన్ యూనిలీవర్

by S Gopi |
మినిమలిస్ట్ బ్రాండ్ కొనే ప్రయత్నాల్లో హిందూస్తాన్ యూనిలీవర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కొత్త తరం వినియోగదారులను చేరేందుకు వ్యూహాత్మక కొనుగోళ్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బ్యూటీ బ్రాండ్ మినిమలిస్ట్ కంపెనీని రూ. 3,000 కోట్లకు కొనుగోలు చేయాలని హెచ్‌యూఎల్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే కంపెనీతో చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుత మెజారిటీ వాటా కోసం చర్చలు మొదలైనప్పటికీ, ఒప్పందం పూర్తయ్యే నాటికి పూర్తిగా 100 శాతం కొనుగోలు దిశగా చర్చలు కొనసాగవచ్చని సమాచారం. ప్రస్తుతానికి కంపెనీ వ్యవస్థాకులైన రాహుల్ యాదవ్, మోహిత్ యాదవ్‌లకు దాదాపు 84 శాతం వాటాను కలిగి ఉన్నారు. పీక్ ఎక్‌వీ పార్ట్‌నర్స్‌కు 6 శాతం వాటా ఉంది. ఒప్పందం కార్యరూపం దాలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న డీ2సీ బ్రాండ్లను బడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు కొనుగోలు చేసే ధోరణిని కొనసాగించినట్టు అవుతుంది. కాగా, గత కొన్నేళ్లలో కొత్త తరం డీ2సీ బ్రాండ్లు విస్తరణలో ఉన్న సవాళ్లను అధిగమించలేక సాంప్రదాయ దిగ్గజ సంస్థలకు విక్రయిస్తున్నాయి. వ్యాపార అవసరాలకు అనుగుణంగా వృద్ధి, విస్తరణ కోసం వివిధ అవకాశాలను పరిశీలిస్తామని హెచ్‌యూఎల్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

Advertisement

Next Story