జగన్, బాబు కేసులపై ఉండవల్లి సూచన

by Anukaran |
జగన్, బాబు కేసులపై ఉండవల్లి సూచన
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్, చంద్రబాబు అక్రమాస్తుల కేసులను ప్రజలందరికీ తెలిసేలా వర్చువల్ కోర్టుల్లో విచారణ చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ న్యాయస్థానాలకు సూచించారు. రాజమండ్రిలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రభుత్వానికి, న్యాయ స్థానాల మధ్య నలుగుతున్న అంశాలపై స్పందించారు.

ఏపీని 15 సంవత్సరాల పాటు పాలించిన చంద్రబాబు కేసులు, నేటి ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసుల విషయంలో లైవ్ టెలీకాస్ట్ చేయాలనే అభిప్రాయం వెలిబుచ్చారు. లైవ్ టెలీకాస్ట్ పద్ధతి విదేశాల్లో ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సీజేకు మెయిల్ చేసినట్లు తెలిపారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారన్నారు. కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని అన్నారు. కోర్టులపై ముఖ్యమంత్రి లేఖ రాయడం ఇదేమీ కొత్త కాదన్నారు.

గతంలో ముఖ్యమంత్రి సంజీవయ్య కోర్టులపై లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించినట్లు ఉండవల్లి వ్యాఖ్యానించారు. జగన్ అన్ని విషయాలలో మొండిగా వెళతారని చెప్పారు. జస్టిస్ రమణ విషయంలో ఆరోపణలు వ్యక్తిగతంగా తాను నమ్మనన్నారు. న్యాయవ్యవస్థలో లోపాలను రాజకీయ వ్యవస్థలు సరిదిద్దాలన్నారు. చట్టం ముందు జడ్జీలు అతీతులు కాదని చెప్పారు. న్యాయవ్యవస్థలపై ఆరోపణల విషయంలో చర్చ గౌరవంగా జరగాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed