- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అడ్రస్ లేని ’ఆయుష్మాన్’
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కష్టకాలంలో పేదలకు చికిత్స గగనంగా మారుతోంది. అటు ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్‌ల కొరత. ఇటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్థిక భారం. దీంతో ఆయుష్మాన్ భారత్ వారికి ఒక చిరుదీపంగా మారింది. పథకం మీద ఆశలెన్ని ఉన్నా అది తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అమలులోకి రాకపోవడంతో కష్టాలు తప్పడంలేదు. ’ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ దానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. ఇప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు ఆ పథకం కింద ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి సుముఖంగా లేవు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం లేదని, ఆ పథకం అమలులోని సాధకబాధకాలపై చర్చలే మొదలుకాలేదని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సంఘం వ్యాఖ్యానించింది. ఎలాగూ ఆరోగ్యశ్రీ పథకంలో కరోనాకు ట్రీట్‌మెంట్ లేకపోవడంతో ఆయుష్మాన్ భారత్ ద్వారా పొందవచ్చన్న పేదలకు దారి దొరకడంలేదు.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా, బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది. దీంతో తెలంగాణలో సైతం విపక్షాలు అదే తరహా నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వంమీద ఒత్తిడి పెరుగుతోంది. నిరాహారదీక్షలూ జరిగాయి. ఇప్పటికీ ఆ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఆ దిశగా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం హఠాత్తుగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కరోనా ట్రీట్‌మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంది. లబ్ధిదారులకు అర్హతలో ఆరోగ్యశ్రీ పథకానికి, ఆయుష్మాన్ భారత్ పథకానికి మధ్య చాలా అంతరం ఉంది. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత చికిత్స లభించని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుష్మాన్ భారత్ ద్వారా లభిస్తుందన్న పేదల ఆశలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.
రాష్ట్రంలో ఈ పథకంలో చేరింది 13 ఆస్పత్రులే..
రాష్ట్రంలో సుమారు మూడున్నర వేల ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 230 వరకు ఆరోగ్యశ్రీ పథకంలో ఎంప్యానెల్ అయ్యాయి. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేవలం 13 ఆస్పత్రులు మాత్రమే ఇప్పటివరకు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో ఆరు కంటి ఆస్పత్రులే. వీటిలో కరోనా చికిత్సలు లేవు. మిగిలిన ఏడింటిలో కొన్ని మాత్రమే కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. ఏకకాలంలో అటు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని, ఇటు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందిగానీ దానికి తగిన కార్యాచరణ మొదలుకాలేదు.
గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేసినందుకు ప్రైవేట ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్ మెంట్ పద్ధతిలో సకాలంలో బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో చికిత్సలను ఆపివేశాయి. ఈటల రాజేందర్ ఆరోగ్య మంత్రి అయిన తర్వాత దశలవారీగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొదలుకావడంతో మళ్ళీ చికిత్స గాడిలో పడింది. ఇప్పుడు బకాయిల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు పెద్దగా పేచీ లేకపోయినప్పటికీ ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో మాత్రం చేరాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు మాత్రమే కాక ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరడానికి అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకం కింద చికిత్సలవారీగా నిర్ణయించిన టారిఫ్ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు గిట్టుబాటుకాదనే అభిప్రాయం బలంగా ఉంది.
26 లక్షల మంది మాత్రమే అర్హులు
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో తెల్ల రేషను కార్డు ఉన్నవారందరికీ ప్రైవేటు (ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంప్యానెల్ అయిన) ఆస్పత్రుల్లో గరిష్ఠంగా రెండు లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్స తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రకారం రాష్ట్రంలో సుమారు 80 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మాత్రం గరిష్ఠ స్థాయిలో 26 లక్షల కుటుంబాలకు అర్హత లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా కుటుంబంలోని సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా గరిష్ఠంగా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందే సౌకర్యం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందడానికి ప్రత్యేకంగా అర్హతలేవీ లేవు. తెల్ల రేషను కార్డు ఉంటే చాలు.
’ఆయుష్మాన్ భారత్’కు అర్హులెవరు?
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంత్యోదయ అన్న యోజన రేషను కార్డు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రాధాన్యత కలిగిన కుటుంబాలు, తెల్ల రేషను కార్డులు, అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలన్నీ అర్హమే. కానీ కొన్ని అంశాల్లో మాత్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేదలకు వేర్వేరు ప్రమాణాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కిందివాటిలో ఏదైనా ఒక అంశానికి చెంది ఉండాలి.
• కేవలం ఒక్క గది కచ్చా ఇల్లు, మట్టిగోడలతో కూడి ఉన్న కుటుంబాలు
• కుటుంబంలో 16-59 ఏజ్ గ్రూపులో ఎవ్వరూ లేని కుటుంబాలు
• కుటుంబానికి ఆదాయం ఆర్జించే పెద్దగా మహిళ ఉన్న కుటుంబాలు (16-59 ఏళ్ళ మధ్య వయసులో పురుషులు ఉండకూడదు)
• అంగవైకల్యంతో ఉన్న కుటుంబం
• ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు
• సొంత సాగుభూమి లేకుండా మాన్యువల్‌గా లేబర్ పని చేసుకుని బతికే కుటుంబాలు
• నివాస స్థలం, ఇల్లు లేని కుటుంబాలు
• నిరాశ్రయులు, ఫుట్‌పాత్‌లపై జీవించే కుటుంబాలు
• ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజర్లు (సఫాయి కర్మచారి) కుటుంబాలు
• ఆది గిరిజన కుటుంబాలు
• వెట్టిచాకిరీ పనిచేస్తూ చట్టబద్ధంగా విముక్తులైనవారు
పట్టణ ప్రాంతాల్లో..
• భిక్షగాళ్ళు, చెత్త ఏరుకునేవారు, ఇళ్ళల్లో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, హాకర్లు, చెప్పులు కుట్టే వృత్తి చేసుకుని జీవనం సాగించేవారు, పలు రకాల వృత్తుల్ని వీధుల్లో చేసుకుని బ్రతికేవారు.
• భవన నిర్మాణ కార్మికులు, ప్లంబర్లు, తాపీ పని మేస్త్రీలు, కార్మికులు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యూరిటీ గార్డులు
• స్వీపర్, పారిశుద్య కార్మికులు, తోటమాలీలు
• గృహపరిశ్రమలను నిర్వహించేవారు, హస్త కళాకారులు, టైలర్లు, చేతివృత్తులపై ఆధారపడి బ్రతికేవారు
• రవాణా కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, ఎడ్లబండ్లను రవాణాకు వాడి బ్రతికేవారు, రిక్షా డ్రైవర్లు
• దుకాణాల్లో పనిచేసే కార్మికులు, సహాయకులు, అటెండర్లు, హెల్పర్లు, డెలివరీ అసిస్టెంట్లు, వెయిటర్లు
• ఎలక్ట్రీషియన్, మెకానిక్, అసెంబ్లర్, రిపేర్ వర్కర్
• వాచ్‌మెన్, దోభీ పనిచేసుకుని బ్రతికేవారు
ఆయుష్మాన్ భారత్‌కు అర్హుహులు
• బైక్, ఆటో, నాలుగు చక్రాల మోటారు వాహనం కలిగినవారు
• వ్యవసాయ అవసరాలకు మూడు చక్రాల, నాలుగు చక్రాల మోటారు వాహనాలను కలిగినవారు
• కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ. 50 వేల కంటే ఎక్కువ రుణ సౌకర్యం కలిగినవారు
• ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలు
• వ్యవసాయేతర పరిశ్రమలను ప్రభుత్వ విధానాల ప్రకారం రిజిస్టర్ చేసుకున్న కుటుంబాలు
• నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారు
• ఆదాయపు పన్ను చెల్లించేవారు
• ప్రొఫెషనల్ టాక్స్ కడుతున్నవారు
• మూడు లేదా అంతకంటే ఎక్కువ గదులు కలిగిన పక్కా ఇళ్ళు (శ్లాబ్, సిమెంటు గోడలు) ఉన్నవారు
• ఫ్రిజ్ ఉన్నవారు
• ఒక వ్యవసాయ పంపు సెట్ ఉండి రెండున్నర ఎకరాల సాగుభూమి కలిగినవారు
• ఇంటికి లాండ్ లైన్ ఫోన్ ఉన్నవారు
• ఐదు ఎకరాల సాగుభూమి కలిగి ఉండి ఒకటికంటే ఎక్కువ సీజన్లకు పంటను పొందుతున్న కుటుంబాలు
• ఏడున్నర ఎకరాల సాగుభూమి ఉండి కనీసం ఒకటి కంటే ఎక్కువ వ్యవసాయ పంపుసెట్లు కలిగిన కుటుంబాలు